టెల్కోల జరిమానా రూ. 2 లక్షలకు పెంపు
న్యూఢిల్లీ: మొబైల్ సర్వీసుల్లో నాణ్యత లోపించిన పక్షంలో ఆపరేటర్లపై విధించే జరిమానాను రూ. 2 లక్షల దాకా పెంచింది టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్. ప్రస్తుతం మొదటిసారి సేవా ప్రమాణాల ఉల్లంఘనకు రూ. 50,000 దాకా, తదుపరి రూ. 1 లక్ష దాకా జరిమానా ఉంటోంది. ఇకపై మొదటి ఉల్లంఘనకు జరిమానా రూ. 1 లక్ష, రెండోసారి రూ. 1.5 లక్షల దాకా, అటుపైన రూ. 2 లక్షల మేర పెనాల్టీ ఉండనుంది. కాల్ డ్రాప్స్ సమస్యతో పాటు ఇతరత్రా సర్వీసుల్లో లోపాలకూ ఈ జరిమానా వర్తిస్తుంది.
ఒక త్రైమాసికంలో ఒక టెలికం సర్కిల్‌లో నమోదైన మొత్తం ట్రాఫిక్‌లో కాల్ డ్రాప్స్ రెండు శాతానికి మించితే పెనాల్టీ విధించడం జరుగుతుందని ట్రాయ్ పేర్కొంది. మరోవైపు, ముంబై, ఢిల్లీ నగరాల్లో కాల్ డ్రాప్ పరిస్థితి రవ్వంతైనా కూడా మెరుగుపడలేదని తెలిపింది. ముంబైలో కనీసం ఒక్క ఆపరేటరు కూడా ప్రమాణాలకు తగ్గ సర్వీసులు అందించడం లేదని, ఢిల్లీలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఎయిర్‌సెల్ నాణ్యమైన సేవలు అందించడంలో వెనుకబడ్డాయని ట్రాయ్ వివరించింది.