సాక్షి, సిటీబ్యూరో: సిమ్ కార్డుల జారీ చేసే విషయంలో టెలికామ్ రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మొబైల్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌తో పాటు దేశవ్యాప్తంగా సిమ్‌స్వాప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో బుధవారం మొబైల్ సర్వీసు ప్రొవైడర్లతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సమావేశమయ్యారు. కోల్‌కతా కేంద్రంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని కంపెనీల పేరు మీద ఉన్న సిమ్ కార్డుల స్థానంలో సరైన పత్రాలు లేకుండానే డూప్లికేట్ సిమ్‌లు పొంది భారీగా టోకరా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు నిందితులు సిమ్‌కార్డుల జారీలో లోపాలను వివరించారని, ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భవిష్యత్‌లో సిమ్ కార్డుల జారీలో ట్రాయ్ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment