Mobile service
-
రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్..
న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించే వారికి జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే 22 విమానాలలో రోజుకు రూ.499తో మొబైల్ సేవలు అందించనుంది. అయితే రిలయన్స్ భాగస్వామ్య సంస్థలైన కాథే పసిఫిక్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్, ఎతిహాడ్ ఎయిర్వేస్, యూరో వింగ్స్, లుఫ్తాన్స, మలిండో ఎయిర్, బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్, లిటాలియా తదితర విమాన సంస్థలలో జియో మొబైల్ ఆఫర్ వర్తించనుంది. కాగా భారత్ నుంచే ప్రయాణించే విదేశీ ప్రయాణికుల కోసం మూడు రోమింగ్ ప్యాక్‌లను జియో ప్రకటించింది. ఒక రోజు వాలిడిటీ సేవలను రూ.499, రూ.699, రూ.999 ధరలతో జియో ప్రకటించింది. అయితే జియో అన్ని ప్లాన్స్లలో 100 నిమిషాల అవుట్ గోయింగ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. కాగా రూ.499 ప్లాన్‌తో 250 మెగాబైట్ (ఎమ్బీ) మొబైల్ డేటాను అందిస్తుంది. మరోవైపు రూ.699తో 500ఎమ్బీ అందిస్తుండగా, రూ.999తో 1జీబీ డేటాను పొందవచ్చు. అయితే జియో ఆఫర్లో ఇన్కమింగ్ ఎస్ఎమ్ఎస్ ఉచితమని సంస్థ ప్రకటించింది. మరిని వివరాల కోసం www.jio.comను సందర్శించవచ్చు. -
‘తీవ్రవాదులే ఎక్కువ వాడుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేయడాన్ని గవర్నర్ సత్యపాల్ మాలిక్ సమర్థించుకున్నారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలను తీవ్రవాదులు, పాకిస్తాన్ ఎక్కువగా వాడుతున్నందునే సమాచార వ్యవస్థను స్తంభింపజేయాల్సి వచ్చిందన్నారు. మొబైల్ సర్వీసులను క్రమంగా పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. కుప్వారా, హంద్వారా జిల్లాల్లో సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘ఫోన్, ఇంటర్నెట్ మాధ్యమాన్ని మనం తక్కువగానే వినియోగిస్తున్నాం. మన దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి తీవ్రవాదులు, పాకిస్తాన్ ఈ సేవలను ఎక్కువగా వాడుతున్నాయి. అందుకే వీటిని నిలిపివేశాం. మొబైల్ సేవలను క్రమంగా పునరుద్ధరిస్తామ’ని ఆయన అన్నారు. ప్రతి కశ్మీరీ పౌరుడి జీవితం తమకు ఎంతో విలువైనదని, ఒక్క ప్రాణం కూడా పోకూడదని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనల్లో పౌరులు ఎవరూ గాయపడలేదని, హింసకు దిగినవారే క్షతగాత్రులయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పౌరుల ప్రాణాలు కాపాడేందుకే సమాచార వ్యవస్థను నిలిపివేసినట్టు అంతకుముందు సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యానించారు. ఈ నెల 5 నుంచి మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో కశ్మీర్లో వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియకుండా పోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. (ఇది చదవండి: అణచివేతతో సాధించేది శూన్యం) -
‘ట్రాయ్’ నిబంధనలు పాటించాలి
సాక్షి, సిటీబ్యూరో: సిమ్ కార్డుల జారీ చేసే విషయంలో టెలికామ్ రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మొబైల్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌తో పాటు దేశవ్యాప్తంగా సిమ్‌స్వాప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో బుధవారం మొబైల్ సర్వీసు ప్రొవైడర్లతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సమావేశమయ్యారు. కోల్‌కతా కేంద్రంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని కంపెనీల పేరు మీద ఉన్న సిమ్ కార్డుల స్థానంలో సరైన పత్రాలు లేకుండానే డూప్లికేట్ సిమ్‌లు పొంది భారీగా టోకరా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు నిందితులు సిమ్‌కార్డుల జారీలో లోపాలను వివరించారని, ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భవిష్యత్‌లో సిమ్ కార్డుల జారీలో ట్రాయ్ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
టెల్కోల జరిమానా రూ. 2 లక్షలకు పెంపు
న్యూఢిల్లీ: మొబైల్ సర్వీసుల్లో నాణ్యత లోపించిన పక్షంలో ఆపరేటర్లపై విధించే జరిమానాను రూ. 2 లక్షల దాకా పెంచింది టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్. ప్రస్తుతం మొదటిసారి సేవా ప్రమాణాల ఉల్లంఘనకు రూ. 50,000 దాకా, తదుపరి రూ. 1 లక్ష దాకా జరిమానా ఉంటోంది. ఇకపై మొదటి ఉల్లంఘనకు జరిమానా రూ. 1 లక్ష, రెండోసారి రూ. 1.5 లక్షల దాకా, అటుపైన రూ. 2 లక్షల మేర పెనాల్టీ ఉండనుంది. కాల్ డ్రాప్స్ సమస్యతో పాటు ఇతరత్రా సర్వీసుల్లో లోపాలకూ ఈ జరిమానా వర్తిస్తుంది. ఒక త్రైమాసికంలో ఒక టెలికం సర్కిల్లో నమోదైన మొత్తం ట్రాఫిక్‌లో కాల్ డ్రాప్స్ రెండు శాతానికి మించితే పెనాల్టీ విధించడం జరుగుతుందని ట్రాయ్ పేర్కొంది. మరోవైపు, ముంబై, ఢిల్లీ నగరాల్లో కాల్ డ్రాప్ పరిస్థితి రవ్వంతైనా కూడా మెరుగుపడలేదని తెలిపింది. ముంబైలో కనీసం ఒక్క ఆపరేటరు కూడా ప్రమాణాలకు తగ్గ సర్వీసులు అందించడం లేదని, ఢిల్లీలో ఎయిర్టెల్, వొడాఫోన్, ఎయిర్‌సెల్ నాణ్యమైన సేవలు అందించడంలో వెనుకబడ్డాయని ట్రాయ్ వివరించింది. -
ల్యాండ్ బ్యాంక్‌తో రూ.500 కోట్లు: బీఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని మొబైల్ సర్వీసులందజేసే బీఎస్ఎన్ఎల్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఎస్ఎన్ఎల్కు ఉన్న 82 స్థలాల ద్వారా ఈ స్థాయి ఆదాయం సాధించాలని బీఎస్ఎన్ఎల్ యోచిస్తోంది. అంతేకాకుండా మొబైల్ సర్వీసులందజేసే ఇతర కంపెనీలతో ఇంట్రా-సర్కిల్ రోమింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా 75వేలకు పైగా ఉన్న మొబైల్ టవర్ల ద్వారా కూడా ఆదాయం ఆర్జించాలని భావిస్తోంది. దీంతో పాటు శిక్షణా కేంద్రాలు, ఏడు టెలికాం ఫ్యాక్టరీల ద్వారా ఆదాయం సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంస్థ టర్న్ అరౌండ్ ప్రణాళికలను బీఎస్ఎన్ఎల్ అధికారులు... ఇటీవల టెలికం మంత్రి రవి శంకర ప్రసాద్‌కు ఇచ్చిన ప్రజంటేషన్లో వివరించారు.