సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేయడాన్ని గవర్నర్ సత్యపాల్ మాలిక్ సమర్థించుకున్నారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలను తీవ్రవాదులు, పాకిస్తాన్ ఎక్కువగా వాడుతున్నందునే సమాచార వ్యవస్థను స్తంభింపజేయాల్సి వచ్చిందన్నారు. మొబైల్ సర్వీసులను క్రమంగా పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. కుప్వారా, హంద్వారా జిల్లాల్లో సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘ఫోన్, ఇంటర్నెట్ మాధ్యమాన్ని మనం తక్కువగానే వినియోగిస్తున్నాం. మన దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి తీవ్రవాదులు, పాకిస్తాన్ ఈ సేవలను ఎక్కువగా వాడుతున్నాయి. అందుకే వీటిని నిలిపివేశాం. మొబైల్ సేవలను క్రమంగా పునరుద్ధరిస్తామ’ని ఆయన అన్నారు. ప్రతి కశ్మీరీ పౌరుడి జీవితం తమకు ఎంతో విలువైనదని, ఒక్క ప్రాణం కూడా పోకూడదని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనల్లో పౌరులు ఎవరూ గాయపడలేదని, హింసకు దిగినవారే క్షతగాత్రులయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పౌరుల ప్రాణాలు కాపాడేందుకే సమాచార వ్యవస్థను నిలిపివేసినట్టు అంతకుముందు సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యానించారు. ఈ నెల 5 నుంచి మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియకుండా పోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. (ఇది చదవండి: అణచివేతతో సాధించేది శూన్యం)
Comments
Please login to add a commentAdd a comment