న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కశ్మీర్ లోయకు రావాలంటూ మాలిక్ ఇచ్చిన ఇన్విటేషన్‌ను తాను స్వీకరిస్తున్నానని, ఎలాంటి నిబంధనలు లేకుండా తాను కశ్మీర్ ప్రజలు కలిసి ముచ్చటిస్తానని రాహుల్ తాజాగా ట్విటర్‌లో స్పష్టం చేశారు. తనను ఉద్దేశించి సత్యపాల్ మాలిక్ చేసిన ట్వీట్‌కు రాహుల్ స్పందిస్తూ.. ‘డియర్ మాలిక్‌జీ... నా ట్వీట్‌కు మీరిచ్చిన దుర్బలమైన బదులును చూశాను. జమ్మూకశ్మీర్‌ను సందర్శించి.. అక్కడి ప్రజలతో మాట్లాడాలంటూ మీరిచ్చిన ఆహ్వానాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా స్వీకరిస్తున్నాను. ఎప్పుడు రమ్మంటారు?’అని పేర్కొన్నారు.
కశ్మీర్ లోయలోని పరిస్థితులపై రాహుల్ వదంతులను వ్యాప్తి చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులను లోయలో పర్యటించేందుకు అనుమతించాలంటూ కోరడం ద్వారా ఈ అంశాన్ని రాజకీయం చేయాలని ఆయన చూస్తున్నారని సత్యపాల్ మాలిక్ మంగళవారం మండిపడిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో పర్యటించేందుకు తమకు హెలికాప్టర్ అవసరం లేదని, స్వేచ్ఛాయుతంగా పర్యటించి.. స్థానిక పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేతల బృందానికి అవకాశం ఇవ్వాలని రాహుల్ అంతకుముందు కోరగా.. అందుకు సత్యపాల్ మాలిక్ సిద్ధమేనని పేర్కొన్నట్టు కథనాలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment