జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా డిమాండ్‌ను
పునరుద్ఘాటించిన రాహుల్‌గాంధీ
ఇటీవలి కశ్మీర్ పర్యటనలో విద్యార్థినులతో రాహుల్ ముఖాముఖి
వీడియోను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలనే డిమాండ్‌ను రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఢిల్లీ నుంచి జమ్మూకశ్మీర్‌ను పాలించాలనుకోవడం అవివేకమన్నారు. గత వారం ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా విద్యారి్థనులతో రాహుల్ గాంధీ ముఖాముఖి మాట్లాడారు. ఆ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసింది.
మళ్లీ.. పెళ్లి మాట.. నవ్వులు
ఇక రాహుల్‌గాంధీ నిత్యం ఎదుర్కొనే అత్యంత పెద్ద ప్రశ్నను విద్యారి్థనుల నుంచి మరోసారి ఎదుర్కొన్నారు. సంభాషణలో భాగంగా పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి గురించి విద్యార్థులను ఆయన అడగ్గా.. వెంటనే వారు రాహుల్‌ను అదే ప్రశ్న అడిగారు. అయితే తాను 20, 30 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నా ఆ ఒత్తిడిని అధిగమించానని చె ప్పారు. పెళ్లి చేసుకుంటారా? అని మరో విద్యారి్థని అడగ్గా.. ‘ఇప్పటికైతే ఆలోచన చేయలేదు.. భవిష్యత్‌లో చెప్పలేను’అని సమాధానమిచ్చారు. చేసుకుంటే మాత్రం మమ్మల్ని ఆహ్వానించండంటూ విద్యార్థినులంతా ఒకేసారి కోరారు. ‘తప్పకుండా’అని చెప్పడంతో విద్యార్థుల నవ్వులతో ప్రాంతమంతా సందడిగా మారిపోయింది.
ఈ వీడియోలో రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్‌లో జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడుతూ, ఒక రాష్ట్రం నుంచి రాష్ట్ర హోదాను తొలగించడం భారత చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. అది చేసిన విధానం తమకు నచ్చలేదని, రాష్ట్ర హోదాను తిరిగి పొందడం, అందులో జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు ప్రాతినిధ్యం ఉండటం తమ ప్రధాన లక్ష్యమని రాహుల్ తెలిపారు.
ఢిల్లీ నుంచి కశ్మీర్‌ను, జమ్మూను నడపాలనుకోవడంలో అర్థం లేదని ఆయన కొట్టిపారేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి మాటా వినరు. మొదటి నుంచి తాము చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. అదే అసలు సమస్య. తనది తప్పని చూపించినా ఒప్పుకోరు. అలాంటి వ్యక్తులు నిత్యం ఏదో ఒక సమస్యను సృష్టిస్తారు. తాము చెప్పిందే కరెక్ట్ అనుకోవడం బలం కాదు.. బలహీనత. ఆత్మన్యూనత నుంచే ఇలాంటివి వస్తాయి’’అని రాహుల్ విద్యార్థులతో వ్యాఖ్యానించారు.
The women of Kashmir have strength, resilience, wisdom and a whole lot to say.
But are we giving them a chance for their voices to be heard? pic.twitter.com/11Te8MM5fH— Rahul Gandhi (@RahulGandhi) August 26, 2024
యూట్యూబ్ ఛానల్‌లో వీడియో...
ఇదే వీడియోను రాహుల్‌గాంధీ తన వ్యక్తిగత యూట్యూబ్ చానల్లోనూ పోస్టు చేశారు. వివిధ కళాశాలల్లో లా, ఫిజిక్స్, జర్నలిజం, పొలిటికల్ సైన్స్ వంటి సబ్జెక్టులను చదువుతున్న విద్యార్థుల సమస్యలను, ఆకాంక్షలను తాను లోతుగా అర్థం చేసుకున్నానని రాహుల్ ఆ పోస్టులో పేర్కొన్నారు. కోల్‌కతా ఘటన నేపథ్యంలో మహిళలపై వేధింపుల గురించి కూడా విద్యార్థులతో మాట్లాడానని, ఇటువంటి ఘటనలు వ్యవస్థాగత సమస్యలను ఎలా ప్రతిబింబిస్తాయి, ప్రాంతాలకతీతంగా మహిళల భద్రత, గౌరవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని విద్యార్థులు తమ ఆందోళనలను పంచుకున్నారని వెల్లడించారు. కశీ్మర్ మహిళలకు గొప్ప శక్తి, నిలదొక్కుకునే ధైర్యం, వివేకం ఉన్నాయని, ఒక్కసారి వారికి అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపుతారని కొనియాడారు. వారికి గౌరవం, భద్రతతోపాటు సమాన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని రాహుల్ నొక్కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment