న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ నాటికి భారత్‌లో మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 90.3 కోట్లకు చేరిందని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. జూన్‌లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) కోసం 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటున్న ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మేలో 90 కోట్లుగా ఉన్న టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య జూన్‌లో 0.34 శాతం వృద్ధితో 90.3 కోట్లకు చేరింది. జూన్‌లో 31.6 లక్షల మంది కొత్తగా మొబైల్ వినియోగదారులవగా, ల్యాండ్‌లైన్ కనెక్షన్లు 1.2 లక్షలు తగ్గాయి. పట్టణ వినియోగదారుల సంఖ్య 60.5 శాతం నుంచి 60.4 శాతానికి తగ్గగా, గ్రామీణ వినియోగదారుల సంఖ్య 39.4 శాతం నుంచి 39.6 శాతానికి పెరిగింది. జూన్‌లో భారతీ ఎయిర్‌టెల్‌కు అత్యధికంగా కొత్త వినియోగదారులు లభించారు.
ఈ కంపెనీ జూన్‌లో 12.63 లక్షల మంది కొత్త వినియోగదారులను సాధించింది. 12.09 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా సెల్యులర్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (8.33 లక్షల మంది కొత్త వినియోగదారులు), ఎయిర్‌సెల్(6.11 లక్షలు), వొడాఫోన్(3.47లక్షలు)లు నిలిచాయి. 1.32 లక్షల మంది కొత్త వినియోగదారులను సాధించినప్పటికీ, వినియోగదారుల వృద్ధి విషయంలో వీడియోకాన్ గరిష్ట వృద్ధి(5.81 శాతం)ని సాధించింది. యూనినార్‌కు 2.95 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. టాటా టెలిసర్వీసెస్ సంస్థ 6.39 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. ఈ సంస్థతో పాటు మరో ఐదు కంపెనీలు సిస్టమ శ్యామ టెలిసర్వీసెస్(3.5 లక్షలు) బీఎస్‌ఎన్‌ఎల్(75,000) కూడా వినియోగదారులను కోల్పోయాయి. మేలో 1.513 కోట్లుగా ఉన్న బ్రాడ్‌బాండ్ వినియోగదారుల సంఖ్య జూన్‌లో 1.519 కోట్లకు పెరిగింది.
టెలికం యూజర్లు 90 కోట్లకు పైనే..
Published Sat, Sep 7 2013 2:15 AM | Last Updated on Sat, Aug 11 2018 8:24 PM
Advertisement
Advertisement