ఒక్క వర్షంతో ‘తాత్కాలిక’ బండారం బట్టబయలు
- కూలిన అసెంబ్లీ, సచివాలయం భవనాల గోడలు.. పైకప్పు లీకేజీ
- చాంబర్లలోకి భారీగా వర్షపు నీరు.. సిబ్బంది ఇక్కట్లు
- 20 నిమిషాల వానకే ‘రాజధాని’ అతలాకుతలం.. భారీ వర్షం కురిస్తే పెనుప్రమాదం!
- మీడియాకు అనుమతి నిరాకరణ.. సర్వత్రా ఆందోళన
అమరావతి: గట్టిగా 20 నిమిషాలపాటు వర్షం కురిసిందోలేదో.. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని అమరావతి అతలాకుతలం అయింది. భారీ టెక్నాలజీతో నిర్మించిన తాత్కాలిక భవనాలు గడగడలాడాయి. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం భవనాలను వర్షపు నీరు ముంచెత్తింది. ఉద్యోగులు, సిబ్బంది లోపల ఉండలేని పరిస్థితిలో కార్మికులు నీళ్లను తోడే ప్రయత్నం చేశారు. తాత్కాలిక అసెంబ్లీలోని ప్రతిపక్షనేత కార్యాలయంలోనైతే ఏకంగా నీరు ధారలా కారిన దృశ్యాలు కనిపించాయి.
ఒక్క వర్షంతో.. తాత్కాలిక నిర్మాణాలే అయినా ప్రపంచ స్థాయి టెక్నాలజీని ఉపయోగించామన్న పాలకుల మాట నీటి మూటేనని తేలింది. తాత్కాలిక నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందన్న ప్రజల అనుమానం నిజమైంది. ఇంతా జరుగుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం ఐదో రోజు నవనిర్మాణ దీక్ష పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు వినిపించారు.
చంద్రబాబు ఇల్లు ఇలానే కురుస్తుందా?
అమరావతిలోని తాత్కాలిక భవనాల్లో మంగళవారం కనిపించి దృశ్యాలు చూసి ఆంధ్రదేశం నివ్వెరపోయింది. ఎంత తాత్కాలిక నిర్మాణమైతేమాత్రం మరీ కురవడమేమిటని సచివాలయ ఉద్యోగులు చర్చించుకున్నారు. ‘జనం సొమ్ము కాబట్టే అడ్డగోలుగా దోచుకుతిన్నారు.. అరకొరగా నిర్మాణాలు చేశారు.. ఏం? హైదరాబాద్‌లో వందల కోట్లతో కట్టిన చంద్రబాబు ఇల్లు కూడా ఇలానే కురుస్తుందా?’ అని విపక్ష నేతలు ప్రశ్నించారు. నల్లరేగడి నేలలో నిర్మాణాలు సరికాదని ఎప్పటినుంచో మొత్తుకున్నా చంద్రబాబు పెడచెవినపెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.
చదరపు అడుగుకు రూ.10 వేల ఖర్చు
భారీ దోపిడీకి తెరతీస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక భవనాల నిర్మాణానికి ప్రపంచంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఖర్చు చేశారు. చదరపు అడుగుకు ఏకంగా రూ.10 వేలు ఖర్చుచేసి మొత్తం రూ.900 కోట్ల ప్రజాధానాన్ని బొక్కేశారు. నిర్మాణాలు తూతూ మంత్రంగా సాగుతుండటంపై గతంలోనే ‘సాక్షి’ అనేక కథనాలు రాసింది. కట్టిన ఆరు నెలల్లోనే రాజధాని బండారం బట్టబయలు కావడంతో నవ్వులపాలైన సర్కారు.. తాత్కాలిక భవనాల్లోకి మీడియాను అనుమతించకుండా పరుకుకాపాడుకునే వ్యర్థప్రయత్నం చేసింది.
పొంచిన పెనుముప్పు
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించకముందే.. క్యుములోనింబస్ మేఘాల కారణంగా మంగళవారం పలు జిల్లాలలఓ వర్షాలు కురిశాయి. సరిగ్గా అరగంట కూడా పడని వర్షానికి తాత్కాలిక భవనాలు అతలాకుతలం అయ్యాయి. గోడలు విరిగిపడి, పైకప్పునుంచి నీటి ధారలు కారాయి. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి వర్షాలు ప్రారంభంకానుండటంతో రాజధానికి పెనుముప్పు పొంచిఉందనే చెప్పాలి. ఇవాళ్టి బీభత్సం తరువాత.. ‘మున్ముందు.. గంటో, రెండు గంటలో ఏకధాటిగా భారీ వర్షం కురిస్తే.. తాత్కాలిక భవనాలు తట్టుకుంటాయా? అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.