temporary buildings
-
ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభం
-
ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక భవనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఆదివారం ప్రారంభించారు. సీఆర్డీఏ పరిధిలో నేలపాడులో నిర్మించిన ఈ తాత్కాలిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టులోని తెలుగు న్యాయమూర్తులు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డి, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనానికి కూడా జస్టిస్ రంజన్ గొగోయ్ శంకుస్థాపన చేశారు. ఇక, హైకోర్టు తాత్కాలిక భవనం నుంచి కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై ఇంతవరకూ పూర్తి స్పష్టత లేదు. ఫిబ్రవరి 15 అనంతరం ఈ భవనం నుంచి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. -
మిగిలింది 40 రోజులే..
సాక్షి, అమరావతి: హైకోర్టు తాత్కాలిక భవనాలు డిసెంబర్ రెండో వారానికల్లా అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. సివిల్ పనులు పూర్తి కావడానికే నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఫినిషింగ్, మౌలిక వసతులకు ఎంత లేదన్నా మరో రెండు నెలలు పడుతుందని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే 3 నెలలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 15వ తేదీ నాటికే హైకోర్టు తాత్కాలిక భవనాలను సిద్ధం చేస్తామని ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టుకు సైతం నివేదించింది. తాత్కాలిక భవనంలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తే న్యాయమూర్తుల నివాసానికి అద్దె భవనాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీంతో డిసెంబర్ 15 తర్వాత హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ జారీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో న్యాయవర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 7 నెలలుగా కొనసాగుతున్న పనులు రాజధాని పరిపాలనా నగరానికి అర కిలోమీటరు దూరంలో నేలపూడి వద్ద హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+2 (జీ+5 ఫౌండేషన్) నిర్మించే బాధ్యతను ఈ ఏడాది మార్చిలో రూ.98 కోట్లకు ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించారు. అయితే ఏడు నెలల క్రితం పనులు ప్రారంభమైనా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇంటీరియర్, ప్రధాన భవనాలకు లిఫ్టులు, అదనపు మౌలిక వసతులు, ప్రహరీ గోడ, ప్రవేశ మార్గాలు, అంతర్గత రోడ్లు, పార్కింగ్, మురుగునీటి పారుదల వ్యవస్థ తదితర పనులను ఇంకా ఎవరికీ అప్పగించలేదు. ఇటీవలే రూ.56 కోట్ల అంచనాతో ఈ పనుల కోసం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ పనులు కూడా ఎల్ అండ్ టీకి అప్పగించే అవకాశాలున్నా లాంఛనాలన్నీ పూర్తై పనులు మొదలయ్యేసరికి ఇంకా సమయం పట్టే పరిస్థితి ఉంది. మిగిలిన సివిల్ పనులు, టెండర్లు ఖరారు కాని మౌలిక వసతుల పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం చెబుతున్న గడువు 40 రోజులు మాత్రమే. అయితే ఈ గడువు లోపు పనులు పూర్తై తాత్కాలిక భవనం అందుబాటులోకి రావడం కష్టమని, కనీసం రెండు నెలలైనా పడుతుందని అధికారులు చెబుతున్నారు. తాత్కాలిక సచివాలయంలా చేస్తారా? మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 15 నాటికి ఈ భవనాన్ని సిద్ధం చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ ఇటీవల ప్రకటించారు. దీంతో తాత్కాలిక సచివాలయం మాదిరిగా హడావుడిగా చేస్తే ఈ పనులు కూడా నాసిరకంగా జరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి వర్షానికే తాత్కాలిక సచివాలయం నీరుగారుతోంది. వానలకు మంత్రుల ఛాంబర్లు తడిసిపోవడం, డ్రెయిన్లు పొంగడం, గోడలు పగుళ్లివ్వడం, ప్రణాళికా లోపంతో గోడలను పగలగొట్టి మళ్లీ కట్టడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్ష నేత ఛాంబర్లో పైకప్పు పెచ్చులూడి వర్షపు నీరు కారడం తెలిసిందే. ఇవన్నీ ప్రభుత్వం హడావుడిగా, నాసిరకంగా పనులు చేయించడం వల్లేనని నిపుణులు గతంలోనే స్పష్టం చేశారు. -
‘తాత్కాలిక బండారం’పై సీఆర్డీఏ వివరణ
- కిటికీలు మూయకపోవడం వల్లే వర్షపు నీరు లోపలికి: కమిషనర్ శ్రీధర్ - ప్రతిపక్షనేత ఛాంబర్లో నీటిధారలపై పరిశీలన చేస్తాం - తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో లోపాలున్నాయని అంగీకారం అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తాత్కాలిక భవనాల్లోకి వర్షపునీరు చేరిన ఘటనపై సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ స్పందించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం తాత్కాలిక భవనాలను సందర్శించిన ఆయన.. ఐదో బ్లాక్‌లోని సర్‌రూఫ్ నుంచి జల్లు కొట్టడం వల్లే భవంతిలోకి నీరు వచ్చిందని మీడియాకు వివరించారు. ‘అసెంబ్లీ నిర్మాణం తర్వాత మొదటిసారి వర్షం కురవడంతో నిర్మాణ లోపాలు అర్థమయ్యాయి. ఐదో బ్లాక్‌లో సర్‌రూఫ్ నుంచి జల్లుకొట్టడం, కొన్నిచోట్ల కిటికీలు మూయకపోవడం వల్లే లోపలికి నీళ్లొచ్చాయి. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారి ఛాంబర్లోకి నీరు రావడంపై చీఫ్ ఇంజనీర్‌తో పరిశీలన చేయిస్తున్నాం’ అని సీఆర్డీఏ కమిషనర్ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం అమరావతిలో కురిసిన వర్షం ధాటికి తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం భవనాల్లోకి భారీగా నీరు రావడం, పైకప్పుల నుంచి నీరు ధారగా కారడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సచివాలయం గోడలు కూలిపోవడంతో ఏం జరుగుతుందోననే అక్కడివారు భయాందోళనకు గురయ్యారు. తాత్కాలిక నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని, తూతూమంత్రంగా నిర్మాణాలు చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రేపు అసెంబ్లీ, సచివాలయానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఒక్క వర్షానికే తాత్కాలిక భవనాలు అతలాకుతలం అయిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల బృందం బుధవారం అమరావతికి వెళ్లనుంది. (ఒక్క వర్షంతో ‘తాత్కాలిక’ బండారం బట్టబయలు) -
ఒక్క వర్షంతో ‘తాత్కాలిక’ బండారం బట్టబయలు
- కూలిన అసెంబ్లీ, సచివాలయం భవనాల గోడలు.. పైకప్పు లీకేజీ - చాంబర్లలోకి భారీగా వర్షపు నీరు.. సిబ్బంది ఇక్కట్లు - 20 నిమిషాల వానకే ‘రాజధాని’ అతలాకుతలం.. భారీ వర్షం కురిస్తే పెనుప్రమాదం! - మీడియాకు అనుమతి నిరాకరణ.. సర్వత్రా ఆందోళన అమరావతి: గట్టిగా 20 నిమిషాలపాటు వర్షం కురిసిందోలేదో.. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని అమరావతి అతలాకుతలం అయింది. భారీ టెక్నాలజీతో నిర్మించిన తాత్కాలిక భవనాలు గడగడలాడాయి. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం భవనాలను వర్షపు నీరు ముంచెత్తింది. ఉద్యోగులు, సిబ్బంది లోపల ఉండలేని పరిస్థితిలో కార్మికులు నీళ్లను తోడే ప్రయత్నం చేశారు. తాత్కాలిక అసెంబ్లీలోని ప్రతిపక్షనేత కార్యాలయంలోనైతే ఏకంగా నీరు ధారలా కారిన దృశ్యాలు కనిపించాయి. ఒక్క వర్షంతో.. తాత్కాలిక నిర్మాణాలే అయినా ప్రపంచ స్థాయి టెక్నాలజీని ఉపయోగించామన్న పాలకుల మాట నీటి మూటేనని తేలింది. తాత్కాలిక నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందన్న ప్రజల అనుమానం నిజమైంది. ఇంతా జరుగుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం ఐదో రోజు నవనిర్మాణ దీక్ష పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు వినిపించారు. చంద్రబాబు ఇల్లు ఇలానే కురుస్తుందా? అమరావతిలోని తాత్కాలిక భవనాల్లో మంగళవారం కనిపించి దృశ్యాలు చూసి ఆంధ్రదేశం నివ్వెరపోయింది. ఎంత తాత్కాలిక నిర్మాణమైతేమాత్రం మరీ కురవడమేమిటని సచివాలయ ఉద్యోగులు చర్చించుకున్నారు. ‘జనం సొమ్ము కాబట్టే అడ్డగోలుగా దోచుకుతిన్నారు.. అరకొరగా నిర్మాణాలు చేశారు.. ఏం? హైదరాబాద్‌లో వందల కోట్లతో కట్టిన చంద్రబాబు ఇల్లు కూడా ఇలానే కురుస్తుందా?’ అని విపక్ష నేతలు ప్రశ్నించారు. నల్లరేగడి నేలలో నిర్మాణాలు సరికాదని ఎప్పటినుంచో మొత్తుకున్నా చంద్రబాబు పెడచెవినపెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. చదరపు అడుగుకు రూ.10 వేల ఖర్చు భారీ దోపిడీకి తెరతీస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక భవనాల నిర్మాణానికి ప్రపంచంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఖర్చు చేశారు. చదరపు అడుగుకు ఏకంగా రూ.10 వేలు ఖర్చుచేసి మొత్తం రూ.900 కోట్ల ప్రజాధానాన్ని బొక్కేశారు. నిర్మాణాలు తూతూ మంత్రంగా సాగుతుండటంపై గతంలోనే ‘సాక్షి’ అనేక కథనాలు రాసింది. కట్టిన ఆరు నెలల్లోనే రాజధాని బండారం బట్టబయలు కావడంతో నవ్వులపాలైన సర్కారు.. తాత్కాలిక భవనాల్లోకి మీడియాను అనుమతించకుండా పరుకుకాపాడుకునే వ్యర్థప్రయత్నం చేసింది. పొంచిన పెనుముప్పు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించకముందే.. క్యుములోనింబస్ మేఘాల కారణంగా మంగళవారం పలు జిల్లాలలఓ వర్షాలు కురిశాయి. సరిగ్గా అరగంట కూడా పడని వర్షానికి తాత్కాలిక భవనాలు అతలాకుతలం అయ్యాయి. గోడలు విరిగిపడి, పైకప్పునుంచి నీటి ధారలు కారాయి. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి వర్షాలు ప్రారంభంకానుండటంతో రాజధానికి పెనుముప్పు పొంచిఉందనే చెప్పాలి. ఇవాళ్టి బీభత్సం తరువాత.. ‘మున్ముందు.. గంటో, రెండు గంటలో ఏకధాటిగా భారీ వర్షం కురిస్తే.. తాత్కాలిక భవనాలు తట్టుకుంటాయా? అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. -
ఆ నిధులతో సచివాలయం, అసెంబ్లీ కట్టేశాం
అమరావతి: శాశ్వత భవనాలకు ఇచ్చిన సొమ్మును ఏపీ ప్రభుత్వ తాత్కాలిక భవనాల పేరుతో దుర్వినియోగం చేస్తోంది. గతేడాది నూతన రాజధానిలో శాశ్వత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానాలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు వ్యయం చేసేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రాజధానిలో సర్కారు భవనాల నిర్మాణాలకు కేంద్రం రూ.450 కోట్లు మంజూరు చేసింది. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రూ.500 కోట్ల వ్యయానికి సంబంధించి లెక్కలతో సహా వినియోగ పత్రాలను సమర్పిస్తేనే రూ.450 కోట్లను విడుదల చేస్తామని కేంద్రం మెలిక పెట్టింది. తొలుత సీఆర్డీఏ రూ.500 కోట్లను కన్సల్టెంట్లు, డీపీఆర్‌ల రూపకల్పనకు వ్యయం చేశామంటూ వినియోగ పత్రాలను సమర్పించగా వీటిని నీతి ఆయోగ్ తిరస్కరించింది. కన్సల్టెంట్లు, డీపీఆర్‌ల కోసం నిధులు ఇవ్వలేదని, సర్కారు భవనాల నిర్మాణాలకే నిధులు ఇచ్చామని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగ పత్రాలను సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వెలగపూడిలో తాత్కాలికంగా ఆరు బ్లాకుల్లో నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ భవనాలకు కేంద్రం ఇచ్చిన నిధులను (రూ.554.62 కోట్లు) వ్యయం చేసినట్లు సీఆర్డీఏ వినియోగ పత్రాలు సమర్పించింది. వీటికి నీతి ఆయోగ్ ఆమోదముద్ర వేస్తూ గత ఏడాది మంజూరు చేసిన రూ.450 కోట్లకు సిఫారసు చేసింది. నూతన రాజధానిలో సర్కారు కార్యాలయ భవనాల నిర్మాణాలకు రూ.43,000 కోట్ల ఆర్థిక సాయం అందించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే తాత్కాలిక నిర్మాణాలకు కేంద్ర నిధులను వెచ్చించడం ఏమిటని నీతి ఆయోగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా, సచివాలయం, రాజభవన్, హైకోర్టు తదితర భవనాల నిర్మాణాలకు రూ.2,500 కోట్లు ఇవ్వాల్సిందిగా నీతి ఆయోగ్ సిఫారసు చేయగా ఆ మేరకే నిధులిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు అమరావతిలో సర్కారు భవనాల నిర్మాణాలకు రూ.1,500 కోట్లు ఇవ్వగా మిగిలిన రూ.1,000 కోట్లను మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.