‘తాత్కాలిక బండారం’పై సీఆర్‌డీఏ వివరణ
- కిటికీలు మూయకపోవడం వల్లే వర్షపు నీరు లోపలికి: కమిషనర్ శ్రీధర్
- ప్రతిపక్షనేత ఛాంబర్‌లో నీటిధారలపై పరిశీలన చేస్తాం
- తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో లోపాలున్నాయని అంగీకారం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తాత్కాలిక భవనాల్లోకి వర్షపునీరు చేరిన ఘటనపై సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ స్పందించారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం తాత్కాలిక భవనాలను సందర్శించిన ఆయన.. ఐదో బ్లాక్‌లోని సర్‌రూఫ్ నుంచి జల్లు కొట్టడం వల్లే భవంతిలోకి నీరు వచ్చిందని మీడియాకు వివరించారు.
‘అసెంబ్లీ నిర్మాణం తర్వాత మొదటిసారి వర్షం కురవడంతో నిర్మాణ లోపాలు అర్థమయ్యాయి. ఐదో బ్లాక్‌లో సర్‌రూఫ్ నుంచి జల్లుకొట్టడం, కొన్నిచోట్ల కిటికీలు మూయకపోవడం వల్లే లోపలికి నీళ్లొచ్చాయి. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారి ఛాంబర్‌లోకి నీరు రావడంపై చీఫ్ ఇంజనీర్‌తో పరిశీలన చేయిస్తున్నాం’ అని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు.
మంగళవారం మధ్యాహ్నం అమరావతిలో కురిసిన వర్షం ధాటికి తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం భవనాల్లోకి భారీగా నీరు రావడం, పైకప్పుల నుంచి నీరు ధారగా కారడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సచివాలయం గోడలు కూలిపోవడంతో ఏం జరుగుతుందోననే అక్కడివారు భయాందోళనకు గురయ్యారు. తాత్కాలిక నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని, తూతూమంత్రంగా నిర్మాణాలు చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
రేపు అసెంబ్లీ, సచివాలయానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
ఒక్క వర్షానికే తాత్కాలిక భవనాలు అతలాకుతలం అయిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల బృందం బుధవారం అమరావతికి వెళ్లనుంది.