ఆ నిధులతో సచివాలయం, అసెంబ్లీ కట్టేశాం
అమరావతి: శాశ్వత భవనాలకు ఇచ్చిన సొమ్మును ఏపీ ప్రభుత్వ తాత్కాలిక భవనాల పేరుతో దుర్వినియోగం చేస్తోంది. గతేడాది నూతన రాజధానిలో శాశ్వత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానాలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు వ్యయం చేసేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రాజధానిలో సర్కారు భవనాల నిర్మాణాలకు కేంద్రం రూ.450 కోట్లు మంజూరు చేసింది. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రూ.500 కోట్ల వ్యయానికి సంబంధించి లెక్కలతో సహా వినియోగ పత్రాలను సమర్పిస్తేనే రూ.450 కోట్లను విడుదల చేస్తామని కేంద్రం మెలిక పెట్టింది. తొలుత సీఆర్‌డీఏ రూ.500 కోట్లను కన్సల్టెంట్లు, డీపీఆర్‌ల రూపకల్పనకు వ్యయం చేశామంటూ వినియోగ పత్రాలను సమర్పించగా వీటిని నీతి ఆయోగ్ తిరస్కరించింది.
కన్సల్టెంట్లు, డీపీఆర్‌ల కోసం నిధులు ఇవ్వలేదని, సర్కారు భవనాల నిర్మాణాలకే నిధులు ఇచ్చామని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగ పత్రాలను సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వెలగపూడిలో తాత్కాలికంగా ఆరు బ్లాకుల్లో నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ భవనాలకు కేంద్రం ఇచ్చిన నిధులను (రూ.554.62 కోట్లు) వ్యయం చేసినట్లు సీఆర్‌డీఏ వినియోగ పత్రాలు సమర్పించింది. వీటికి నీతి ఆయోగ్ ఆమోదముద్ర వేస్తూ గత ఏడాది మంజూరు చేసిన రూ.450 కోట్లకు సిఫారసు చేసింది.
నూతన రాజధానిలో సర్కారు కార్యాలయ భవనాల నిర్మాణాలకు రూ.43,000 కోట్ల ఆర్థిక సాయం అందించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే తాత్కాలిక నిర్మాణాలకు కేంద్ర నిధులను వెచ్చించడం ఏమిటని నీతి ఆయోగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా, సచివాలయం, రాజభవన్, హైకోర్టు తదితర భవనాల నిర్మాణాలకు రూ.2,500 కోట్లు ఇవ్వాల్సిందిగా నీతి ఆయోగ్ సిఫారసు చేయగా ఆ మేరకే నిధులిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు అమరావతిలో సర్కారు భవనాల నిర్మాణాలకు రూ.1,500 కోట్లు ఇవ్వగా మిగిలిన రూ.1,000 కోట్లను మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.