హైదరాబాద్: ప్రజాసంఘాల చలో అసెంబ్లీ నేపథ్యంలో టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓయూ క్యాంపస్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరంగల్ ఎన్ కౌంటర్ కు నిరసనగా ప్రజాసంఘాల నేతలు, వామపక్షాల నేతలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఓయూ హాస్టల్లో, నిజాం కాలేజీ హాస్టల్లో పోలీసులు అర్థరాత్రి సోదాలు నిర్వహించారు. చలో అసెంబ్లీకి బయల్దేరిన 200 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టు సమాచారం. కరీంనగర్ జిల్లాలో 100 మంది విద్యార్థుల అరెస్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష నేతలు, విద్యార్థులను అరెస్ట్ చేశారు. అలాగే ప్రజాసంఘాల నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజధానికి వచ్చే రహదారులపై చెక్ పోస్టులు పెట్టారు.
చలో అసెంబ్లీకి ప్రజా సంఘాలు పిలుపునివ్వడంతో అసెంబ్లీకి వెళ్లే అన్నిదారుల వద్ద ఆంక్షలు విధించి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. వరంగల్లో వామపక్ష నేతలను అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్ట్లు కొనసాగుతున్నాయి. కాగా, అసెంబ్లీ ముట్టడికి ప్రజాసంఘాల నేతలను మందస్తు అక్రమ అరెస్టులను తెలంగాణ పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గట్టం లక్ష్మణ్ ఖండించారు.
నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జిల్లాలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, అడుగడుగున వాహనాలు తనీఖీలు చేస్తున్నారు. బీబీనగర్, చౌటుప్పల్ టోల్గేట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చలో అసెంబ్లీకి బయలుదేరిన వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలో వామపక్ష నేత మల్లేశం సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు.
ఖమ్మం మధిర సర్కిల్లో చలో అసెంబ్లీకి బయల్దేరిన వామపక్ష నేతలను అరెస్ట్ చేశారు. సిద్ధిపేటలో చలో అసెంబ్లీకి బయలుదేరిన పౌరహక్కుల సంఘం నేత భూపతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను పోలీసులు గృహనిర్బంధం చేసినట్టు తెలిసింది. విప్లవ కవి వరవరరావు ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగినట్టు సమాచారం.
చలో అసెంబ్లీకి ప్రజాసంఘాల పిలుపు, పలు అరెస్ట్లు
Published Wed, Sep 30 2015 7:25 AM | Last Updated on Tue, Jul 31 2018 4:48 PM
Advertisement