ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
నలుగురు నక్సల్స్ మృతి
రాయ్‌పూర్/చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. బిజాపూర్ జిల్లా మిర్తూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హల్లూర్-హౌకా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో 55 మంది జవాన్లున్న జిల్లా రిజర్వు బృందం(డీఆర్‌జీ) కూంబింగ్‌కు వెళ్లింది. బృందానికి తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఇరుపక్షాల మధ్య గంటపాటు కాల్పులు జరిగాయి. తర్వాత ఘటనా స్థలిలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలు, నాలుగు తుపాకులు, విప్లవ సాహిత్యం దొరికాయి.
మృతుల్లో ఒకరిని బైరాంగఢ్ ఏరియా కమిటీ యాక్షన్ టీం కమాండర్ రౌతూగా గుర్తించారు. అతనిపై ఛత్తీస్ ప్రభుత్వం గతంలో రూ.8 లక్షల రివార్డు ప్రకటించింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో సర్వీస్ రివాల్వర్, 303 రివాల్వర్ , 315 రైఫిల్, ఒక ట్వల్ బోర్ రైఫిల్‌తో పాటు మరికొంత మందుగుండు సామగ్రి ఉంది. మరోపక్క.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఒడిశా రాష్ర్టం నారాయణపట్నం బ్లాక్‌లోని కుంబారిపుట్ వద్ద పోలీసులు గురువారం ఓ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు ల్యాండ్ మైన్స్, జిలిటిన్ స్టిక్స్‌తో పాటు కొన్ని పేలుడు పదార్థాలు అందులో ఉన్నాయి.