సెల్వం: కీలుబొమ్మా? త్యాగశీలా?
చాయ్‌వాలా నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఓ. పన్నీర్ సెల్వం అధికార వైభవం.. వరుసగా మూడోసారి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. రెండుసార్లు జయలలిత కోసం పదవిని త్యాగం చేసిన సెల్వం.. మూడోసారి శశికళ కోసమూ అదే చేశారు. ’కీలుబొమ్మ ముఖ్యమంత్రి’గా తనకున్న ముద్రను చరిత్రార్థం చేసుకున్నారు.
వ్యక్తిగత కారణాలతో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు సెల్వం ఆదివారం గవర్నర్‌కు లేఖ రాశారు. ఆయన రాజీనామాను గవర్నర్ తాజాగా ఆమోదించారు. 65 ఏళ్ల సెల్వం గురించి తెలిసినవారికి ఇది ఆశ్చర్యం కలిగించేదో.. షాక్ కలిగించేదో కాదు. ఆయన వీరవిధేయతకు, వినయానికి మారుపేరుగా ముద్రపడ్డారు.
2001లో సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా జయలలితను అడ్డుకున్నప్పుడు తొలిసారి సెల్వాన్ని ఈ పదవి వరించింది. ఆరు నెలల తర్వాత ఎలాంటి రగడ చేయకుండా అమ్మకు పువ్వుల్లో పెట్టి మళ్లీ పదవిని అప్పగించారు సెల్వం. ఆ తర్వాత 2014లో అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా కోర్టు తేల్చడంతో మరోసారి సెల్వం సీఎం అయ్యారు. ఇది కూడా కేవలం ఏడు నెలల మురిపేమే అయింది.
ఈసారి రెండు నెలలే ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. అయితే, ఈ కాలంలో సొంతంగా ముఖ్యమంత్రిగా తనకంటూ ఓ ముద్ర వేసుకునేందుకు సెల్వం ప్రయత్నించారు. వెనుకుండి మార్గనిర్దేశం చేసేందుకు జయలలిత లేకపోవడం కూడా ఆయన స్వతంత్రంగా వ్యవహరించడానికి కారణమైంది. జయలలిత ఉన్నప్పుడు ఆమె ప్రతి ఫైలు పరిశీలించాకే సెల్వం సంతకం పెట్టేవారు. కానీ ఈసారి జయలలిత సన్నిహితురాలైన షీలా బాలాకృష్ణన్ వంటివారి సలహాలతో సీఎంగా సెల్వం స్వతంత్రంగానే వ్యవహరించారు. ప్రతిపక్ష నేత స్టాలిన్ మద్దతు ఉండటం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అండగా నిలబడటంతో సెల్వం ఈసారి ముఖ్యమంత్రి పదవిలో సుదీర్ఘకాలం కొనసాగవచ్చునని, వెన్నెముక కలిగిన నేతగా తనను తాను నిరూపించుకోవచ్చునని భావించారు. కానీ చిన్నమ్మ శశికళ ఎత్తుల ముందు ఆయన నిలబడలేక.. రెండు నెలలకే చేతులేత్తెశారు సెల్వం. ప్రత్యర్థులను సవాల్ చేయగల రాజకీయ చాతుర్యం లేకపోవడం, పవర్ సెంటర్‌గా ఎదుగలేకపోవడం ఈసారి సెల్వం రాజీనామాకు దారితీశాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ రెండు నెలలకాలంలో సెల్వం ప్రతిపక్షాల ప్రశంసలు సైతం పొందగలిగారు. అసెంబ్లీ సమావేశాలను సజావుగా నిర్వహించారు. ఎప్పటిలాగా ఈసారి డీఎంకే సభ్యులు వాకౌట్లు చేయలేదు. సభలో దుమారం రేపలేదు. 'ఆయనకు బీజేపీ వ్యూహాత్మక మద్దతు ఉంది. అన్నాడీఎంకే శ్రేణుల మద్దతుతోపాటు ప్రజాభిప్రాయం కూడా సెల్వానికి అనుకూలంగా ఉంది. అయినా ఆయన శశికళను ఢీకొట్టే సాహసం చేయకూడదని నిర్ణయించుకున్నారు' అని అన్నాడీఎంకే నేత ఒకరు తెలిపారు.