ఈ పిల్లలకు చదువు తప్ప అన్నీ వచ్చు: ఎంపీ
బెంగాల్ యూనివర్సిటీలలోని కొంతమంది విద్యార్థులకు చదువు తప్ప అన్నీ వచ్చని బీజేపీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ నటి, గాయని రూపా గంగూలీ మండిపడ్డారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ సెమినార్ సందర్భంగా కొందరు విద్యార్థులు నిరసన తెలుపుతూ దేశవ్యతిరేక నినాదాలు చేయడంతో ఆమె మండిపడ్డారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల స్థితగతులపై చర్చించేందుకు యూనివర్సిటీలో ఈ సెమినార్ ఏర్పాటుచేశారు. దానికి బంగ్లాదేశ్, భారతదేశాల నుంచి పలువురు నాయకులు వచ్చారు. త్రిపుర గవర్నర్ తథగాత రాయ్ కూడా హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నియంత్రణ గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సెమినార్ దాదాపు ముగుస్తోందనగా కొందరు విద్యార్థులు వచ్చి అక్కడ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 'ఆజాదీ' అని నినాదాలు చేశారు.
బెంగాలీ విశ్వవిద్యాలయాల్లో చదువు తప్ప అన్నీ ఉంటున్నాయని రూపా గంగూలీ అన్నారు. వాళ్లు పేరు తెచ్చుకోవాలనుకుంటే మంచి పనులు చేయాలని, వాళ్లు మంచి శాస్త్రవేత్తలయితే అది బెంగాల్‌తో పాటు దేశానికి కూడా మేలు చేస్తుందని చెప్పారు. స్వాతంత్ర్యం కావాలని అంతగా కోరుకునేవాళ్లు ప్రభుత్వం తమకిస్తున్న డబ్బు నుంచి ఎందుకు స్వాతంత్ర్యం అడగట్లేదని ప్రశ్నించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను పెంచుతున్నారని, దాన్నుంచి ఎందుకు స్వాతంత్ర్యం కోరుకోవట్లేదని అన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో దాదాపు ఏడాది కాలం నుంచి ఇలా జాతివ్యతిరేక ఆందోళనలు ఎక్కువవుతున్నాయి.