పాక్‌లో నిషేధం అనంతరం.. తొలి సినిమా ఇదే!
ముంబై: ఎట్టకేలకు పాకిస్థాన్‌లో బాలీవుడ్ సినిమాలు విడదల కాబోతున్నాయి. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ’కాబిల్’ సినిమాతో ఇది ప్రారంభం కాబోతున్నది. చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ ఈ విషయాన్ని మంగళవారం ట్విట్టర్‌లో ప్రకటించాడు. ’అవును. ఇది నిజమే. కాబిల్ సినిమా కరాచీలో ఈ రోజు రాత్రి 11 షో ప్రదర్శితం కానుంది. రేపటినుంచి పాకిస్థాన్ అంతటా ఈ సినిమా ప్రదర్శితంకానుంది’ అని రోషన్ ప్రకటించారు.
దేశంలో కాబిల్ సినిమా విడుదలలో పారదర్శకత పాటించలేదని, తన సినిమాకు తగినన్ని థియేటర్లు ఇవ్వలేదని రాకేష్ రోషన్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి ఇరుదేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాకిస్థాన్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనను నిషేధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాల విడుదలపై పాక్‌లో నిషేధం విధించడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినిమాలపై తాజాగా నిషేధాన్ని ఎత్తివేశారు. బ్యాన్ ఎత్తివేసిన తర్వాత పాకిస్థాన్‌లో విడుదలైన తొలి బాలీవుడ్ సినిమాగా ’కాబిల్’ నిలిచింది.