'చెల్లెళ్లు చూపిన అమ్మాయినే చేసుకుంటా'
న్యూఢిల్లీ: తన చెల్లెళ్లు చూపిన అమ్మాయినే వివాహం చేసుకుంటానని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో జర్దారీ కుమారుడు బిల్వాల్ భుట్టో జర్దారీ(28) శనివారం మీడియాతో పేర్కొన్నారు. బిల్వాల్ ప్రస్తుతం పాకిస్తానీ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్ గా, పార్టీ కేంద్ర కార్యనిర్వహణ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తనకు ఇప్పటివరకూ చాలా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని చెప్పుకొచ్చిన ఈ యువ పొలిటీషియన్ వాటన్నింటిని తిరస్కరించినట్లు చెప్పారు.
తన చెల్లెళ్లు భక్తావర్ భుట్టో జర్దారీ, ఆసిఫా భుట్టో జర్దారీలు చూపిన అమ్మాయినే తాను వరిస్తానని స్పష్టం చేశారు. తనను చేసుబోయే అమ్మాయి తన చెల్లెళ్ల మన్ననలు పొందగలగాలని చెప్పారు. అయితే అది అంత సులువు కాదని అన్నారు. బిల్వాల్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ లోని ప్రముఖ రాజకీయ నేతలు భిన్నంగా స్పందించారు. పూర్తిగా రాజకీయాల్లోకి రాకముందే వివాహం చేసుకోవాలని నవాజ్ షరీఫ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అబిద్ షేర్ అలీ.. బిల్వాల్ కు సూచించారు.
దీనివల్ల భవిష్యత్తులో రాజకీయ కుట్రలను అడ్డుకోవచ్చని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ లా రెండు పెళ్లిళ్లు చేసుకోవద్దని బిల్వాల్ కు సూచించారు. ప్రేమ కోసం మాత్రమే పెళ్లి చేసుకోవాలని మరో ముత్తాహిదా కౌమి నాయకుడు రవూఫ్ సిద్దిఖీ.. బిల్వాల్ కు సూచించారు. నచ్చిన అమ్మాయిని వరించాలని లేకపోతే జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు.
2019 వరకూ బిల్వాల్ కు వివాహం జరిగే అవకాశంలేదని ఓ జోతిష్యుడు పేర్కొన్నారు. బిల్వాల్ జాతకంలో నక్షత్రాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయని చెప్పారు. వివాహం విషయంలో అచ్చు ఇమ్రాన్ ఖాన్ ను పోలిన జాతకాన్ని బిల్వాల్ కలిగివున్నారని చెప్పారు. బిల్వాల్ ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకుంటారని కూడా పేర్కొన్నారు.