ఉసిరే అని తింటే.. ఉసురు తీస్తుంది
చూడ్డానికి ఉసిరి కాయలా కనిపిస్తోంది కదా అని దీన్ని తింటే.. ఉసురు తీస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టుగా పేరొందిన మాంచినీల్ చెట్టు పండు. చెట్టు పేరులో మంచి ఉంది గానీ.. ఇది మహా చెడ్డది. ఎందుకంటే.. పండు తినడం సంగతి సరే.. సమీపంలోకి వెళ్లినా.. ఒళ్లు మంటలు పుడతాయి. చెట్టు కొమ్మలు, ఆకుల నుంచి కారే తెల్లటిపాలు వంటిది చర్మంపై పడితే బొబ్బలు తేలతాయి. మంటల్లో మనల్ని ఫ్రై చేస్తున్నట్టు ఉంటుంది.
చెట్టు బెరడును కాల్చిన పొగ కళ్లను తాకితే.. తాత్కాలికంగా.. ఒక్కోసారి శాశ్వతంగా అంధత్వం వచ్చే ప్రమాదముంది. అందుకే ఈ చెట్టు ఉన్న చోట్ల డేంజర్ బోర్డులు పెడతారు. ఇంతకీ ఈ చెట్టు ఏయే ప్రాంతాల్లో ఉందో చెప్పలేదు కదూ.. అమెరికాలోని ఫ్లోరిడా, కరేబియన్ దీవులు, బహమాస్. దీని చరిత్ర ఎంత గొప్పదంటే.. అమెరికాను కనుగొన్న కొలంబస్ ఈ చెట్టు పండుకు ‘డెత్ ఆపిల్’ అని పేరు పెట్టాడు. అప్పట్లో విషప్రయోగం ద్వారా పేరొందిన యుద్ధ వీరులను చంపడానికి ‘మాంచినీల్’ ఎంతో సహాయపడిందట!