
'నారాయణ అయినా మరొకరైనా శిక్ష తప్పదు'
తిరుపతి: 'ప్రభుత్వానికి ఎవరూ చుట్టం కాదు..తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు..నారాయణ అయినా మరొకరైనా చట్టానికి అందరూ సమానమే' అని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లా కడపలోని నారాయణ కాలేజ్ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల మృతి పై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ ముగిసింది. దీంతో నివేదికను సోమవారం కమిటీ చైర్మన్ విజయలక్ష్మీ తిరుపతిలో గంటాకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మృతిపై త్రిసభ్య కమిటీ నివేదిక అందజేసిందని, ఇంకా పరిశీలించలేదన్నారు. నివేదికను ప్రిన్సిపల్ సెక్రటరీకి అందజేయమని అధికారులకు సూచించినట్టు ఆయన తెలిపారు. ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా పలు చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యాయం చేయాలని మృతుల తల్లిదండ్రులు అడిగినమాట వాస్తవమేనని ఆయన సాక్షికి తెలిపారు. ఆత్మహత్యల ఘటనపై కమిటీ నివేదిక ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు.
ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. పవన్ వ్యాఖ్యల్ని తాము పాజిటివ్‌గా తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొని, పరోక్షంగా పవన్ తమకు సహకరించారని ఆయన అన్నారు.