కొత్త తరం నాయకత్వానికి నాంది: కేంద్ర మంత్రి శశి థరూర్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల తాజా ఎన్నికల ఫలితాలు నూతన తరం నాయకత్వానికి నాంది పలుకుతున్నాయని కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి శశి థరూర్ అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీకి దిగే విషయంలో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై పార్టీలో చర్చ జరుగుతుందని, తర్వాతే నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. మన దగ్గర అధ్యక్ష తరహా ఎన్నికల విధానం లేదన్నారు. ఈ మేరకు పార్లమెంటు వెలుపల థరూర్ సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి నాయకత్వం ఉందన్నారు. తాజా ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను నిలబెట్టే విషయం చర్చకు వచ్చిందన్నారు. ‘రాహుల్ యువకుడూ కాదు అలాగని ముసలివాడూ కాదు. ఆయన శక్తిమంతుడు’ అని థరూర్ నొక్కిచెప్పారు.
పథకాలు, కార్యక్రమాలు అనే రెండు అంశాలపై ఎన్నికల పోరు జరిగిందని, కాంగ్రెస్‌లోని విలువల విధానాన్ని ప్రజలు తెలుసుకోవాలని, అదే సమయంలో బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తాజా తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని, ఆత్మశోధనకు ఇది ఉత్తమ అవకాశంగా భావిస్తున్నామని తెలిపారు.