ఎట్టకేలకు నోరువిప్పిన శశిథరూర్
తిరువనంతపురం : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎట్టకేలకు నోరువిప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు వార్తలపై ఆయన తన ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. బీజేపీలో చేరికపై ఇప్పటికే తనను చాలామంది అడిగారని ఆయన అన్నారు. అవన్నీ రూమర్లేనని శశిథరూర్ తోసిపుచ్చారు. ఊహాజనితమైన వాటిపై తాను స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇప్పటికి లెక్కలేనన్నిసార్లు తనను అడిగారని, దానికి కూడా తాను పలుమార్లు సమాధానమిచ్చానన్నారు. గతంలోనూ చాలాసార్లు శశిథరూర్ బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ వ్యవహారంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ మాట్లాడుతూ... నలుగురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని, వారిలో శశిథరూర్ ఒకరని అన్నారు. కేరళ కాంగ్రెస్ నేతల చేరికపై కేపీపీసీ ప్రెసిడెంట్ ఎంఎం హసన్ వద్ద నివేదికలు కూడా ఉన్నాయన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను హసన్ తోసిపుచ్చారు.
నలుగురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతున్నట్లు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎస్‌ఎం కృష్ణ, జాఫర్ షరీఫ్‌లా బీజేపీలో చేరే నాయకులెవరూ కేరళలో లేరని అన్నారు. ఈ నెల 12న జరిగే మలప్పురం ఉప ఎన్నిక ప్రచారం శశిథరూర్ పాల్గొంటారని తెలిపారు. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై శశిథరూర్‌ను అడగగా, అదంతా బీజేపీ చేస్తున్న ప్రచారమేనని ఆయన కొట్టిపారేసినట్లు చెప్పారు.
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ను స్వాగతించడంతో కాంగ్రెస్ పార్టీ గతంలో శశిథరూర్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. శశిథరూర్ వ్యాఖ్యలు కేరళలోని కాంగ్రెస్కు నష్టం కల్గించేవిధంగా ఉన్నాయంటూ ఆ రాష్ట్ర పార్టీ శ్రేణులు అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశాయి. ఏఐసీసీ క్రమశిక్షణా ఉల్లంఘన కింద భావించిన అధిష్టానం ఆయన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా తొలగించింది.