‘టైటానిక్’ బిస్కెట్ రూ.15 లక్షలు
లండన్: ‘టైటానిక్’ బిస్కెట్ వేలంలో 15 వేల పౌండ్లు(రూ.15 లక్షలు) పలికింది. టైటానిక్ ఓడ మంచుకొండను ఢీకొంటున్నప్పుడు తీసిన ఆ కొండ ఫొటో 21వేల పౌండ్లు( రూ.20 లక్షలు)కు అమ్ముడుబోయింది. హెన్రీ అల్‌డ్రిడ్జ్ అండ్ సన్స్ సంస్థ వీటిని వేలం వేసింది. టైటానిక్ మునిగిన సమయంలో సేకరించిన బాణసంచా, బిస్కెట్లు, లైఫ్‌బోట్లు లాంటి వన్నీ ఎంతో విలువైనవని పేర్కొంది. వీటిని వేలంలో గ్రీస్‌కు చెందిన సేకర్త దక్కించుకున్నట్లు తెలిపింది.
మంచుకొండను తాకినప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో 10 వేల నుంచి 15 వేల పౌండ్లు పలుకుతుందని అంచనా వేయగా 21 వేల పౌండ్లకు కొనుగోలు చేశారన్నారు. ప్రమాద సమయంలో కెప్టెన్ అర్థర్ రోస్ట్రన్.. ధనికులకు బహుమతిగా ఇచ్చిన కప్పును 1.29 లక్షల పౌండ్లకు(రూ. 1.28 కోట్లు ) యూకే సేకర్త దక్కించుకున్నారు. ‘టైటానిక్’కు సంబంధించి ఇప్పటివరకూ నిర్వహించిన వేలాల్లో ఈ కప్పు మూడవ అత్యధిక ధర పలికింది.