న్యూయార్క్: ఉడీ దాడి అనంతరం అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్ చేతులు కట్టిపడేయాలనే ఆలోచనలో భారత్ ఉంది. మరి అంతర్జాతీయంగా పాక్ పై ఒత్తిడి తేవడానికి భారత్ కు ఒక సువర్ణావకాశం మాత్రమే ఉంది. అదే కాంప్రహెన్సివ్ కన్వేన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం(సీసీఐటీ). 1996లో యూఎన్ సమావేశాల్లో సీసీఐటీని గురించి తొలిసారి భారత్ ప్రస్తావించింది.
అయితే, ప్రపంచదేశాలు సీసీఐటీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తుండటంతో ఆ దిశగా అడుగు ముందుకు పడటం లేదు. ఒక దేశం ఎలా ప్రవర్తిస్తే అది టెర్రిరిజంగా పరిగణించాలి? లాంటి అంశాలపై ఏళ్లుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీసీఐటీ ఒప్పందంపై ప్రపంచదేశాలు సంతకం చేస్తే టెర్రరిజాన్ని పెంచిపోషించే దేశాలను న్యాయపరంగా శిక్షించేందుకు అవకాశం కలుగుతుంది. భారత్ ప్రపంచదేశాలను ఒప్పించి సీసీఐటీపై సంతకాలు చేయించగలిగితే.. పాకిస్తాన్ ను న్యాయపరంగా దోషిగా నిలబెట్టవచ్చు.
భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం యూఎన్ సభను ఉద్దేశించి ప్రసగించనున్న నేపథ్యంలో సీసీఐటీపై ఏకాభిప్రాయ అవకాశాలు మళ్లీ కనిపిస్తున్నాయి. స్వరాజ్ ప్రసంగంపై మాట్లాడిన విదేశాంగశాఖ అధికార ప్రతినిథి వికాస్ స్వరూప్ టెర్రిరిజాన్ని ప్రోత్సహించే దేశాలను న్యాయపరంగా ఎదుర్కొవడంపై చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. చాలా దేశాలు సీసీఐటీ ఒప్పందంపై సంతకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సుష్మా అడ్రస్ ను ప్రస్తావించని వికాస్.. టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.