విజయ్ ఎలక్ట్రికల్స్... తోషిబా చేతికి!
విజయ్ ఎలక్ట్రికల్స్... తోషిబా చేతికి!
Published Wed, Sep 11 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నలభై ఏళ్ల కిందట రాష్ట్రంలో ఆరంభమై అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్... అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటైన తోషిబా కార్పొరేషన్ చేతుల్లోకి వెళ్లబోతోంది. విజయ్ తాలూకు ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వ్యాపారంలో మెజారిటీ వాటాను తోషిబా సొంతం చేసుకుంటోంది. దీనికోసం తోషిబా దాదాపు 200 మిలియన్ డాలర్లను(దాదాపు రూ.1300 కోట్లు) వెచ్చిస్తోంది. ఈ కొనుగోలు ప్రక్రియ నవంబరు నాటికి పూర్తవుతుందని తోషిబా ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో ఉన్న విజయ్ ఎలక్ట్రికల్స్ ప్రస్థానం 1973లో ఆరంభమైంది. దీనికి అధినేత దాసరి జై రమేష్.
అంచెలంచెలుగా ఎదుగుతూ... 2006లో ప్రపంచంలోనే తొలిసారిగా 1200 కెవి ట్రాన్స్‌ఫార్మర్లను తయారు చేసిన తొలి సంస్థగా విజయ్ గుర్తింపు పొందింది. దాన్ని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు సరఫరా చేసింది. అదే సంవత్సరంలో స్విచ్‌గేర్ వ్యాపారంలోకి కూడా ప్రవేశించింది. ప్రస్తుతం విజయ్‌కి హైదరాబాద్, ఉత్తరాఖండ్‌లలో యూనిట్లున్నాయి. ఇవికాక సంరక్షణ ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రోటెక్నికా స్విచ్‌గేర్స్ అనే అనుబంధ సంస్థలున్నాయి. బ్రెజిల్, మెక్సికోల్లో కూడా తమకు యూనిట్లున్నట్లు విజయ్ తెలిపింది. విజయ్ ఎలక్ట్రికల్స్ వ్యాపారాన్ని విలీనం చేసుకోవటానికి కొత్త కంపెనీని ఆరంభిస్తామని, తమ డిజైన్, తయారీ టెక్నాలజీలను కూడా విజయ్‌తో ఇంటిగ్రేట్ చేస్తామని తోషిబా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తకెషి యొగుటా చెప్పారు.
ఈ కొత్త కంపెనీ దేశంలోని వివిధ మార్కెట్లలోకి, వివిధ విభాగాల్లోకి ప్రవేశిస్తుందని కూడా ఆయన చెప్పారు. ‘‘అంతర్జాతీయంగా మా ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార వ్యూహాలకు ఈ కొనుగోలు అత్యవసరం. వచ్చే ఐదేళ్లలో అంతర్జాతీయంగా మా నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకోవటం ద్వారా ఈ విభాగంలో 20% వాటాను దక్కించుకోవాలన్నదే మా లక్ష్యం’’ అని వివరించారాయన. కాగా కంపెనీ సాంకేతిక బలం, నిపుణుల సామర్థ్యం తోషిబా గ్రూపులో భాగం కానున్నందుకు సంతోషంగా ఉందని విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ దాసరి జై రమేష్ ఈ సందర్భంగా చెప్పారు. 2006లో విజయ్ ఎలక్ట్రికల్స్‌ను 550 మిలియన్ డాలర్లుగా అంచనా కట్టగా...
అప్పట్లో నిధులు అవసరమై స్వల్ప వాటాను 3ఐ గ్రూప్ రూ.120 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ప్రస్తుతం ట్రాన్స్‌మిషన్-డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వ్యాపారంలో మాత్రమే విజయ్ మెజారిటీ వాటాను రూ.1300 కోట్లకు (200 మిలియన్ డాలర్లు) విక్రయిస్తోంది. ఈ వాటా విక్రయం ద్వారా 3ఐ గ్రూప్ కూడా ఎగ్జిట్ కానున్నట్లు సమాచారం. అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాల్ని తయారు చేసే తోషిబా... 1875లో ఆరంభమయింది. ప్రస్తుతం దానికి అనుబంధంగా 590 కంపెనీలున్నాయి. 2,06,000 మంది ఉద్యోగులున్న దీని వార్షిక టర్నోవర్ 60 బిలియన్ డాలర్లు.
Advertisement
Advertisement