Dasari Jai Ramesh
-
వైఎస్సార్సీపీలోకి జోరుగా చేరికలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. శనివారం పలువురు ప్రముఖులు ఆ పార్టీలో చేరారు. పారిశ్రామికవేత్త, టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జైరమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ మాజీ అధ్యక్షుడు బుక్కచర్ల నల్లప్పరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి సతీష్వర్మతోపాటుగా అనంతపురం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. నేతల చేరికల నేపథ్యంలో తరలివచ్చిన వారి అనుచరగణంతో హైదరాబాద్‌లోని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాస పరిసరాలు కిటకిటలాడాయి. శనివారం ఉదయం నుంచీ ఒక్కొక్కరుగా తమ అనుచరగణంతో తరలివచ్చిన ఈ నేతలు జగన్‌ను కలుసుకున్నారు. ఆయన వారికి కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరభద్రరావు పార్టీలో చేరిన సందర్భంగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు, అదీప్‌రాజు, గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబూరావులు ఉన్నారు. మోదుగుల పార్టీలో చేరినప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తాఫాలు పాల్గొన్నారు. దాసరి జైరమేష్ వెంట పెద్దసంఖ్యలో ఆయన శ్రేయోభిలాషులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ పార్టీలో చేరిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎం.అరుణ్‌కుమార్ ఉన్నారు. ప్రజలకు అర్థమైంది.. చంద్రబాబు ఏం చెప్పినా వారు వినరు: మోదుగుల సీఎం చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని, ఇక ఆయనేం చెప్పినా నమ్మే పరిస్థితులు లేవని టీడీపీ నేత మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మీడియాతో అన్నారు. పార్టీలో చేరడానికి ముందు ఆయన టీడీపీకి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తమ ఆశాజ్యోతి జగన్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరానని, పల్నాడులో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తానని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ఎంపీగా అయినా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా అయినా పోటీ చేస్తానని పేర్కొన్నారు. తనకు టీడీపీలో సరైన న్యాయం చేయలేదన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ తనపైన మాట్లాడాల్సిన మాటలు కాదని, టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు తనపై విమర్శలు చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగట్లేదని తెలిసి వైఎస్సార్సీపీలో చేరానన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తానన్నారు. గతంలో పార్లమెంటులో తనపై దాడి చేస్తే తనకు మద్దతుగా నిలవకపోగా నిందలు వేశారని ఆవేదన వెలిబుచ్చారు. తనలాంటి వ్యక్తికి టీడీపీలో టికెట్ లేదనడం వారికే సిగ్గుచేటన్నారు. గల్లా గుంటూరుకు అతిథిలాంటివారని, ఆయనకు బ్యాలెట్ పేపర్‌తో బుద్ధి చెపుతామని అన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడానికి వచ్చామని, జగన్ గెలుపు ఖాయమని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరం: దాడి నాలుగేళ్ల తర్వాత వైఎస్సార్సీపీలోకి రావడం సొంతగృహానికి వచ్చినట్టుగా ఉందని దాడి వీరభద్రరావు అన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఆయన ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం మంచి పాలనను అందించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. పాలనను చంద్రబాబు గాలికొదిలేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ప్రజలు గుర్తుకొచ్చి పప్పు, బెల్లాలు పంచి ఓట్లు పడతాయని ఆశిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ప్రజలు తెలివితక్కువ వారని, గతం మరుస్తారని, తనను నమ్ముతారని చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రజలు ఇలాంటివి చాలా చూశారు. విజయభాస్కరరెడ్డి హయాం నుంచి చూస్తున్నారు. ఎన్టీఆర్ టీడీపీ పెడుతున్నపుడు రూ.2 కిలో బియ్యం అంటే కోట్ల విజయభాస్కరరెడ్డి రూ.1.90కి కిలో బియ్యం ఇస్తానన్నా ప్రజలు ఆయన జిమ్మిక్కులను నమ్మలేదు’’ అని గుర్తు చేశారు. టీడీపీని చంద్రబాబు తెలుగు కాంగ్రెస్‌గా మార్చారని, కాంగ్రెస్‌కు అనుబంధ సంస్థగా తయారు చేశారని దాడి విమర్శించారు. టీడీపీని ఎవ్వరు పరిపాలిస్తున్నారో అర్థం కావట్లేదని టీడీపీ అభిమానులు బాధపడుతున్నారన్నారు. టీడీపీ జాతీయ గౌరవాధ్యక్షులుగా రాహుల్ ఉన్నారా, చంద్రబాబు ఉంటారా.. అనుమానంగా ఉందన్నారు. ఏ క్షణంలోనైనా టీడీపీని కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసే పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పాలన పోవటం, జగన్ పాలన రావటం చరిత్రాత్మక అవసరమన్నారు. కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల పార్టీకి దూరంగా ఉన్నానని, ఏ రకంగా పార్టీ ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడతానని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని, పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో తానుగానీ, తన కుమారుడు రత్నాకర్గానీ బరిలో ఉంటామన్నారు. మంత్రి సునీతకు షాక్ అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుక్కచర్ల నల్లప్పరెడ్డి, ఆయన సోదరులు వీరారెడ్డి, సుబ్బారెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. గణనీయమైన అనుచరగణం గల ఈ సోదరులు టీడీపీని వీడటం మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ నాలుగోతరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు యు.కుళ్లాయప్ప, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్‌యాదవ్ కూడా పార్టీలో చేరారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన దాసరి బాలవర్థన్ రావు
-
తెలుగుదేశం పార్టీకి మరో ఝలక్..
సాక్షి, హైదరాబాద్ : గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కృష్ణాజిల్లా విజయ డెయిరీ డైరెక్టర్ దాసరి వెంకట బాలవర్థన్ రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో దాసరి బాలవర్థన్ రావు ఇవాళ ఉదయం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాలవర్థన్ రావుకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, బాలవర్థన్ రావు సోదరుడు దాసరి జై రమేష్ పాల్గొన్నారు. కాగా ఇప్పటికే దాసరి జై రమేష్...వైఎస్సార్ సీపీలో చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా దాసరి బాలవర్ధన్ రావు మాట్లాడుతూ... గన్నవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని అన్నారు. గన్నవరంలో ప్రజల కష్టసుఖాలు చెప్పుకునే పరిస్థితి టీడీపీలో లేదని అన్నారు. కార్యకర్తల భవిష్యత్ కోసం తాను వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు. అయితే తాను ఎలాంటి హామీలు అడగలేదని దాసరి బాలవర్ధన్ రావు పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేందుకు తాను సిద్ధమన్నారు. -
జగన్‌తో జై రమేష్
-
టీడీపీ పాలన అవినీతిమయం
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వ పాలన అవినీతి మయంగా మారిపోయిందని, ఇంత వరకూ చూడని అవినీతి ఇప్పుడు ఏపీలో జరుగుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త, విజయ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జైరమేష్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలను తామే భరించలేక పోతున్నామని కొందరు టీడీపీ ఎంపీలు, కార్యకర్తలే తనకు చెప్పారన్నారు. శుక్రవారం ఆయన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. జగన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలోనే ఓ ఎంపీ తనతో మాట్లాడుతూ ఇప్పటికే ఒక్కో అధికార పార్టీ ఎమ్మెల్యే రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకూ సంపాదించేశారని చెప్పారన్నారు. ఇక ఈ మూడేళ్లలో ఒక్కొక్కరు రూ. 200 కోట్లు నుంచి రూ. 300 కోట్లు సంపాదించి ఉంటారని ఆయన తెలిపారు. ఇంత అవినీతి సాగుతూ ఉంటే ఇక రాష్ట్రం ఏం అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి పనికీ 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో టీడీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానకరమైన రీతిలో నడుపుతోందని, తెలుగు జాతిని హీనాతి హీనమైన పరిస్థితుల్లోకి తీసుకెళుతోందని, ఆ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని జైరమేష్ పేర్కొన్నారు. జగన్ అన్ని విధాలుగా జనాకర్షణ కలిగిన నాయకుడని రాబోయే ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించి మంచి పరిపాలన అందిస్తారని తెలిపారు. జగన్ చేస్తున్న ఎన్నికల వాగ్దానాలను చూస్తున్నానని, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకంతో ఆయనకు మద్దతునిస్తున్నానని స్పష్టం చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసే అంశంపై కూడా భేటీ సందర్భంగా చర్చించామని, దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌తో మాట్లాడుతున్న దాసరి జైరమేష్, చిత్రంలో అడుసుమిల్లి జయప్రకాష్, ఎంపీ విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు టీడీపీ రాజకీయాల మీద విరక్తి ‘మా సోదరుడు దాసరి బాలవర్థన్‌రావు టీడీపీలో కొనసాగినా నేను మాత్రం ఆ పార్టీకి 2001 నుంచీ దూరంగా ఉంటున్నాను. 1999లో విజయవాడ లోక్‌సభ, గన్నవరం శాసనసభ స్థానం రెండు సీట్లు ఇస్తామని అంతకు మునుపు వాగ్దానం చేసిన చంద్రబాబు మాట తప్పారు. దాంతో టీడీపీ రాజకీయాల మీద విరక్తి చెంది దూరంగా ఉన్నాను. ప్రస్తుతం నేను ఆ పార్టీలో సభ్యుడను కూడా కాను. మేము పార్టీకి 35 ఏళ్లుగా సేవలు చేయడం తప్ప, ఒక్క పైసా కూడా పార్టీ నుంచి ఆశించింది లేదు. సంపాదించిందీ లేదు. కానీ పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు ఎన్నో రకాలుగా నేను సహాయం చేశాను. ఆయనకు వ్యక్తిగతంగా కూడా చాలా సహాయం చేశాను. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి నేనూ.. ఒక రకంగా కారణమయ్యాను. నాదెండ్ల భాస్కర్‌రావు ఉదంతంలో కూడా నేను అహర్నిశలు పార్టీ వెంటే ఉన్నాను. అంతే కాని పార్టీ నుంచి ఆశించింది కాని, పార్టీ నుంచి పొందింది కానీ ఎప్పుడూ లేదు. ఒక్క పైసా తీసుకున్నట్లు చూపిస్తే అందుకు కట్టుబడి ఉంటాను. జగన్ విలువలు పాటించే నేత జగన్ కొన్ని విలువలు పాటిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఉండాలి. ఇవే ఆయనలో నాకు నచ్చాయి. జగన్ ఎప్పుడూ కూడా ఒక మాట ఇచ్చి తప్పడం కానీ, ఇచ్చిన మాటకు నిలబడి ఉండక పోవడం కానీ చేయలేదు. ఒక వేళ ఆయన చేయలేను అనుకుంటే అదే చెబుతున్నారు. ఇక చేయగలుగుతాననుకుంటే తప్పనిసరిగా చేస్తానంటున్నారు. అంతేగానీ చంద్రబాబు మాదిరిగా 100 వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నిర్వర్తించని మనిషి జగన్ కాదు. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అదే అర్థమైంది. జగన్ మాటలు చేతలు.. ఆయనకున్న ప్రజాదరణను చూస్తున్నాము. ఇప్పుడు ఒక ప్రభంజనంలా రాష్ట్రంలో జగన్ గాలి వీస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన నూటికి నూరుపాళ్లు విజయం సాధించడం ఖాయం. బాబు పాలనలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యం.. చంద్రబాబు పాలనలో ఒక సామాజికవర్గానికే అత్యధిక ప్రాధాన్యం లభిస్తోందన్న వాదనలో నిజముందని నేనూ నమ్ముతున్నాను. రాజధాని నిర్మాణం ఇప్పటి వరకూ కుంటి నడక నడుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంది. నా జీవితంలో ఇంత అవినీతి ఎప్పుడూ చూడలేదు. ప్రతి పనికి 20 నుంచి 30 శాతం వరకూ బేరాలాడుతున్నట్లు నాకు సమాచారం ఉంది. ఈ రకంగా రాష్ట్ర జీడీపీలో 20 నుంచి 30 శాతం వాళ్ల సొంతానికి లాక్కుంటే ఇక ప్రజలకు మిగిలిందేమిటి? ఇదే విషయాన్ని నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. ఈ అవినీతిని భరించలేకపోతున్నామని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలు బోలెడంత మంది నాతో చెప్పారు. ఇలా దోచుకునే వాళ్లు ఇక ప్రజలకు ఏం చేస్తారు?’ త్వరలోనే వైఎస్సార్సీపీలో చేరుతా.. జగన్ వద్ద నేను ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా చేయక పోయినా మంచి రోజు చూసుకొని వైఎస్సార్సీపీలో చేరుతాను. జగన్‌కు మద్దతునివ్వడంతో పాటుగా సంఘీభావం ప్రకటించడం కోసం ఇవాళ కలిశాను.’ అని దాసరి జై రమేశ్ పేర్కొన్నారు. జై రమేష్ జగన్‌తో భేటీ అయిన సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, దుట్టా రామచంద్రారావు, డాక్టర్ ఎం.అరుణ్‌కుమార్, యలమంచిలి రవి, యార్లగడ్డ వెంకటరావు, కంచర్ల పార్థసారథి, రాజీవ్‌కృష్ణతో సహా పలువురు నేతలు హాజరయ్యారు. -
గన్నవరంలో వైఎస్సార్ సీపీ నేతల సంబరాలు
సాక్షి, గన్నవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం గన్నవరంలో సంబరాలు చేసుకున్నారు. విజయ ఎలక్ట్రానిక్స్ అధినేత దాసరి జై రమేష్ ...వైఎస్సార్ సీపీలోకి చేరనున్న నేపథ్యంలో ఆయన రాకను స్వాగతిస్తూ బాణాసంచా కాల్చారు. కాగా జై రమేష్ ఇవాళ మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం త్వరలో పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో జై రమేష్ గన్నవరం నియోజకవర్గానికి చెందిన నేత కావడంతో పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కాగా జై రమేష్ సోదరుడు దాసరి బాలవర్థనరావు 1999, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. అయితే ఆ తర్వాత ఆయనను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పక్కనపెట్టి ...వల్లభనేని వంశీని రంగంలోకి తెచ్చారు. గత ఎన్నికల్లో కూడా గన్నవరం నియోజకవర్గం సీటు ఆశించిన బాలవర్ధనరావుకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన దాసరి జై రమేష్
-
త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతా..
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే దానిమీద నిలబడతారని దాసరి జై రమేష్ అన్నారు. ఆయన శుక్రవారం వైఎస్ జగన్‌ను హైదరాబాద్‌లో కలిశారు. భేటీ అనంతరం దాసరి జై రమేష్ వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ నూటికి నూరుపాళ్లు విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. మంచిరోజు చూసుకుని త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జై రమేష్ తెలిపారు. తాను పోటీ చేసినా, చేయకపోయినా పార్టీలో మాత్రం చేరతానని చెప్పారు. తమ భేటీలో ఎలాంటి డిమాండ్లు లేవని, పార్టీ విషయాలు, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించామని వెల్లడించారు. వైఎస్ జగన్‌తో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నట్లు జై రమేష్ తెలిపారు. జగన్‌కు ఉన్న ప్రజాదరణ చూస్తున్నామని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ప్రభంజనం వీస్తుందన్నారు. ’వైఎస్ జగన్ ఓ మాట ఇస్తే...దానిమీద నిలబడతారు. చంద్రబాబు నాయుడులా వంద వాగ్దానాలు చేసి ఒక్కటీ కూడా నిలబెట్టుకోకుండా ఉండేవాళ్లు కాదు. నేను 2001 నుంచి టీడీపీకి దూరంగా ఉన్నా. 1999 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ, విజయవాడ పార్లమెంట్ సీటు ఇస్తామని చంద్రబాబు మాట తప్పారు. అప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నా. నేను ఇప్పుడు టీడీపీ సభ్యుడిని కాదు. 35 ఏళ్ల పాటు మేం పార్టీకి త్యాగం చేశాం. పార్టీ ద్వారా కానీ, ప్రభుత్వం నుంచి కానీ రూపాయి ఆశించలేదు. చంద్రబాబుకు కూడా నేను వ్యక్తిగతంగా సాయం చేశా. ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా సహకరించాను. నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు టీడీపీని కాపాడటానికి నా వంతు ప్రయత్నాలు చేశాను. తెలుగు జాతిని అవమానించేలా చంద్రబాబు నాయుడు పాలన సాగుతోంది. అయిదేళ్ల చంద్రబాబు పాలనలో ఉన్నంత అవినీతి నా జీవితంలో చూడలేదు. రాజధాని అమరావతి నిర్మాణం ఇప్పటివరకూ కూడా కుంటినడకే నడుస్తోంది. టీడీపీలో ప్రతి ఎమ్మెల్యే మొదటి రెండేళ్లలోనే రూ.50 నుంచి రూ.200 కోట్లు సంపాదించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి ఎమ్మెల్యే రూ.50-100 కోట్లు దోచుకున్నారని ఓ ఎంపీనే స్వయంగా నాతో అన్నారు. ఈ విధంగా రాష్ట్రాన్ని దోచుకుని ప్రజలకు ఏం మంచి చేయగలుగుతారు. ప్రతి పనికి ఇరవై శాతంపైగా కమీషన్లు డిమాండ్ చేస్తున్నారు. బాబు ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వం అన్నింటిలో విఫలమైంది. త్వరలో మంచి రోజుల వస్తాయి.’ అని అన్నారు. జై రమేష్ వెంట దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, వైఎస్సార్ సీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
వైఎస్ జగన్‌తో దాసరి జై రమేష్ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో విజయ ఎలక్ట్రానిక్స్ అధినేత దాసరి జై రమేష్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో దాసరి జై రమేష్ శుక్రవారం వైఎస్ జగన్‌ను కలిశారు. ఆయన వెంట దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ కూడా ఉన్నారు. దాసరి జై రమేష్ దివంగత ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితుడే కాకుండా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొన్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, నిన్న టీడీపీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అవంతి శ్రీనివాస్ నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాజాగా దాసరి జై రమష్ ...వైఎస్ జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
విజయ్ ఎలక్ట్రికల్స్... తోషిబా చేతికి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నలభై ఏళ్ల కిందట రాష్ట్రంలో ఆరంభమై అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్... అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటైన తోషిబా కార్పొరేషన్ చేతుల్లోకి వెళ్లబోతోంది. విజయ్ తాలూకు ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వ్యాపారంలో మెజారిటీ వాటాను తోషిబా సొంతం చేసుకుంటోంది. దీనికోసం తోషిబా దాదాపు 200 మిలియన్ డాలర్లను(దాదాపు రూ.1300 కోట్లు) వెచ్చిస్తోంది. ఈ కొనుగోలు ప్రక్రియ నవంబరు నాటికి పూర్తవుతుందని తోషిబా ఒక ప్రకటనలో తెలిపింది. ట్రాన్స్ఫార్మర్ల తయారీలో ఉన్న విజయ్ ఎలక్ట్రికల్స్ ప్రస్థానం 1973లో ఆరంభమైంది. దీనికి అధినేత దాసరి జై రమేష్. అంచెలంచెలుగా ఎదుగుతూ... 2006లో ప్రపంచంలోనే తొలిసారిగా 1200 కెవి ట్రాన్స్ఫార్మర్లను తయారు చేసిన తొలి సంస్థగా విజయ్ గుర్తింపు పొందింది. దాన్ని పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు సరఫరా చేసింది. అదే సంవత్సరంలో స్విచ్‌గేర్ వ్యాపారంలోకి కూడా ప్రవేశించింది. ప్రస్తుతం విజయ్‌కి హైదరాబాద్, ఉత్తరాఖండ్‌లలో యూనిట్లున్నాయి. ఇవికాక సంరక్షణ ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రోటెక్నికా స్విచ్గేర్స్ అనే అనుబంధ సంస్థలున్నాయి. బ్రెజిల్, మెక్సికోల్లో కూడా తమకు యూనిట్లున్నట్లు విజయ్ తెలిపింది. విజయ్ ఎలక్ట్రికల్స్ వ్యాపారాన్ని విలీనం చేసుకోవటానికి కొత్త కంపెనీని ఆరంభిస్తామని, తమ డిజైన్, తయారీ టెక్నాలజీలను కూడా విజయ్‌తో ఇంటిగ్రేట్ చేస్తామని తోషిబా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తకెషి యొగుటా చెప్పారు. ఈ కొత్త కంపెనీ దేశంలోని వివిధ మార్కెట్లలోకి, వివిధ విభాగాల్లోకి ప్రవేశిస్తుందని కూడా ఆయన చెప్పారు. ‘‘అంతర్జాతీయంగా మా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార వ్యూహాలకు ఈ కొనుగోలు అత్యవసరం. వచ్చే ఐదేళ్లలో అంతర్జాతీయంగా మా నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకోవటం ద్వారా ఈ విభాగంలో 20% వాటాను దక్కించుకోవాలన్నదే మా లక్ష్యం’’ అని వివరించారాయన. కాగా కంపెనీ సాంకేతిక బలం, నిపుణుల సామర్థ్యం తోషిబా గ్రూపులో భాగం కానున్నందుకు సంతోషంగా ఉందని విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ దాసరి జై రమేష్ ఈ సందర్భంగా చెప్పారు. 2006లో విజయ్ ఎలక్ట్రికల్స్‌ను 550 మిలియన్ డాలర్లుగా అంచనా కట్టగా... అప్పట్లో నిధులు అవసరమై స్వల్ప వాటాను 3ఐ గ్రూప్ రూ.120 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ప్రస్తుతం ట్రాన్స్మిషన్-డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వ్యాపారంలో మాత్రమే విజయ్ మెజారిటీ వాటాను రూ.1300 కోట్లకు (200 మిలియన్ డాలర్లు) విక్రయిస్తోంది. ఈ వాటా విక్రయం ద్వారా 3ఐ గ్రూప్ కూడా ఎగ్జిట్ కానున్నట్లు సమాచారం. అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాల్ని తయారు చేసే తోషిబా... 1875లో ఆరంభమయింది. ప్రస్తుతం దానికి అనుబంధంగా 590 కంపెనీలున్నాయి. 2,06,000 మంది ఉద్యోగులున్న దీని వార్షిక టర్నోవర్ 60 బిలియన్ డాలర్లు.