హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం ఇస్తున్న దాసరి జైరమేష్. చిత్రంలో అడుసుమిల్లి జయప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వ పాలన అవినీతి మయంగా మారిపోయిందని, ఇంత వరకూ చూడని అవినీతి ఇప్పుడు ఏపీలో జరుగుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త, విజయ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జైరమేష్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలను తామే భరించలేక పోతున్నామని కొందరు టీడీపీ ఎంపీలు, కార్యకర్తలే తనకు చెప్పారన్నారు. శుక్రవారం ఆయన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. జగన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలోనే ఓ ఎంపీ తనతో మాట్లాడుతూ ఇప్పటికే ఒక్కో అధికార పార్టీ ఎమ్మెల్యే రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకూ సంపాదించేశారని చెప్పారన్నారు. ఇక ఈ మూడేళ్లలో ఒక్కొక్కరు రూ. 200 కోట్లు నుంచి రూ. 300 కోట్లు సంపాదించి ఉంటారని ఆయన తెలిపారు.
ఇంత అవినీతి సాగుతూ ఉంటే ఇక రాష్ట్రం ఏం అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి పనికీ 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో టీడీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానకరమైన రీతిలో నడుపుతోందని, తెలుగు జాతిని హీనాతి హీనమైన పరిస్థితుల్లోకి తీసుకెళుతోందని, ఆ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని జైరమేష్ పేర్కొన్నారు. జగన్ అన్ని విధాలుగా జనాకర్షణ కలిగిన నాయకుడని రాబోయే ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించి మంచి పరిపాలన అందిస్తారని తెలిపారు. జగన్ చేస్తున్న ఎన్నికల వాగ్దానాలను చూస్తున్నానని, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకంతో ఆయనకు మద్దతునిస్తున్నానని స్పష్టం చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసే అంశంపై కూడా భేటీ సందర్భంగా చర్చించామని, దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..
శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌తో మాట్లాడుతున్న దాసరి జైరమేష్, చిత్రంలో అడుసుమిల్లి జయప్రకాష్, ఎంపీ విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు
టీడీపీ రాజకీయాల మీద విరక్తి
‘మా సోదరుడు దాసరి బాలవర్థన్‌రావు టీడీపీలో కొనసాగినా నేను మాత్రం ఆ పార్టీకి 2001 నుంచీ దూరంగా ఉంటున్నాను. 1999లో విజయవాడ లోక్‌సభ, గన్నవరం శాసనసభ స్థానం రెండు సీట్లు ఇస్తామని అంతకు మునుపు వాగ్దానం చేసిన చంద్రబాబు మాట తప్పారు. దాంతో టీడీపీ రాజకీయాల మీద విరక్తి చెంది దూరంగా ఉన్నాను. ప్రస్తుతం నేను ఆ పార్టీలో సభ్యుడను కూడా కాను. మేము పార్టీకి 35 ఏళ్లుగా సేవలు చేయడం తప్ప, ఒక్క పైసా కూడా పార్టీ నుంచి ఆశించింది లేదు. సంపాదించిందీ లేదు. కానీ పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు ఎన్నో రకాలుగా నేను సహాయం చేశాను. ఆయనకు వ్యక్తిగతంగా కూడా చాలా సహాయం చేశాను. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి నేనూ.. ఒక రకంగా కారణమయ్యాను. నాదెండ్ల భాస్కర్‌రావు ఉదంతంలో కూడా నేను అహర్నిశలు పార్టీ వెంటే ఉన్నాను. అంతే కాని పార్టీ నుంచి ఆశించింది కాని, పార్టీ నుంచి పొందింది కానీ ఎప్పుడూ లేదు. ఒక్క పైసా తీసుకున్నట్లు చూపిస్తే అందుకు కట్టుబడి ఉంటాను.
జగన్ విలువలు పాటించే నేత
జగన్ కొన్ని విలువలు పాటిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఉండాలి. ఇవే ఆయనలో నాకు నచ్చాయి. జగన్ ఎప్పుడూ కూడా ఒక మాట ఇచ్చి తప్పడం కానీ, ఇచ్చిన మాటకు నిలబడి ఉండక పోవడం కానీ చేయలేదు. ఒక వేళ ఆయన చేయలేను అనుకుంటే అదే చెబుతున్నారు. ఇక చేయగలుగుతాననుకుంటే తప్పనిసరిగా చేస్తానంటున్నారు. అంతేగానీ చంద్రబాబు మాదిరిగా 100 వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నిర్వర్తించని మనిషి జగన్ కాదు. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అదే అర్థమైంది. జగన్ మాటలు చేతలు.. ఆయనకున్న ప్రజాదరణను చూస్తున్నాము. ఇప్పుడు ఒక ప్రభంజనంలా రాష్ట్రంలో జగన్ గాలి వీస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన నూటికి నూరుపాళ్లు విజయం సాధించడం ఖాయం.
బాబు పాలనలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యం..
చంద్రబాబు పాలనలో ఒక సామాజికవర్గానికే అత్యధిక ప్రాధాన్యం లభిస్తోందన్న వాదనలో నిజముందని నేనూ నమ్ముతున్నాను. రాజధాని నిర్మాణం ఇప్పటి వరకూ కుంటి నడక నడుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంది. నా జీవితంలో ఇంత అవినీతి ఎప్పుడూ చూడలేదు. ప్రతి పనికి 20 నుంచి 30 శాతం వరకూ బేరాలాడుతున్నట్లు నాకు సమాచారం ఉంది. ఈ రకంగా రాష్ట్ర జీడీపీలో 20 నుంచి 30 శాతం వాళ్ల సొంతానికి లాక్కుంటే ఇక ప్రజలకు మిగిలిందేమిటి? ఇదే విషయాన్ని నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. ఈ అవినీతిని భరించలేకపోతున్నామని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలు బోలెడంత మంది నాతో చెప్పారు. ఇలా దోచుకునే వాళ్లు ఇక ప్రజలకు ఏం చేస్తారు?’
త్వరలోనే వైఎస్సార్‌సీపీలో చేరుతా..
జగన్ వద్ద నేను ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా చేయక పోయినా మంచి రోజు చూసుకొని వైఎస్సార్‌సీపీలో చేరుతాను. జగన్‌కు మద్దతునివ్వడంతో పాటుగా సంఘీభావం ప్రకటించడం కోసం ఇవాళ కలిశాను.’ అని దాసరి జై రమేశ్ పేర్కొన్నారు. జై రమేష్ జగన్‌తో భేటీ అయిన సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, దుట్టా రామచంద్రారావు, డాక్టర్ ఎం.అరుణ్‌కుమార్, యలమంచిలి రవి, యార్లగడ్డ వెంకటరావు, కంచర్ల పార్థసారథి, రాజీవ్‌కృష్ణతో సహా పలువురు నేతలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment