
సాక్షి, హైదరాబాద్ : గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కృష్ణాజిల్లా విజయ డెయిరీ డైరెక్టర్ దాసరి వెంకట బాలవర్థన్ రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో దాసరి బాలవర్థన్ రావు ఇవాళ ఉదయం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాలవర్థన్ రావుకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, బాలవర్థన్ రావు సోదరుడు దాసరి జై రమేష్ పాల‍్గొన్నారు. కాగా ఇప్పటికే దాసరి జై రమేష్...వైఎస్సార్ సీపీలో చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా దాసరి బాలవర్ధన్ రావు మాట్లాడుతూ... గన్నవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొందని అన్నారు. గన్నవరంలో ప్రజల కష్టసుఖాలు చెప్పుకునే పరిస్థితి టీడీపీలో లేదని అన్నారు. కార్యకర్తల భవిష్యత్ కోసం తాను వైఎస్సార్‌సీపీలో చేరినట్లు తెలిపారు. అయితే తాను ఎలాంటి హామీలు అడగలేదని దాసరి బాలవర్ధన్ రావు పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేందుకు తాను సిద్ధమన్నారు.