శనివారం హైదరాబాద్‌లో దాసరి జై రమేశ్, దాడి వీరభద్రరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డిలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. శనివారం పలువురు ప్రముఖులు ఆ పార్టీలో చేరారు. పారిశ్రామికవేత్త, టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జైరమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, ఏపీ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ మాజీ అధ్యక్షుడు బుక్కచర్ల నల్లప్పరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి సతీష్‌వర్మతోపాటుగా అనంతపురం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. నేతల చేరికల నేపథ్యంలో తరలివచ్చిన వారి అనుచరగణంతో హైదరాబాద్‌లోని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాస పరిసరాలు కిటకిటలాడాయి.
శనివారం ఉదయం నుంచీ ఒక్కొక్కరుగా తమ అనుచరగణంతో తరలివచ్చిన ఈ నేతలు జగన్‌ను కలుసుకున్నారు. ఆయన వారికి కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరభద్రరావు పార్టీలో చేరిన సందర్భంగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు, అదీప్‌రాజు, గుడివాడ అమర్‌నాథ్, గొల్ల బాబూరావులు ఉన్నారు. మోదుగుల పార్టీలో చేరినప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తాఫాలు పాల్గొన్నారు. దాసరి జైరమేష్ వెంట పెద్దసంఖ్యలో ఆయన శ్రేయోభిలాషులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ పార్టీలో చేరిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఎం.అరుణ్‌కుమార్ ఉన్నారు.
ప్రజలకు అర్థమైంది.. చంద్రబాబు ఏం చెప్పినా వారు వినరు: మోదుగుల
సీఎం చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని, ఇక ఆయనేం చెప్పినా నమ్మే పరిస్థితులు లేవని టీడీపీ నేత మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మీడియాతో అన్నారు. పార్టీలో చేరడానికి ముందు ఆయన టీడీపీకి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తమ ఆశాజ్యోతి జగన్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరానని, పల్నాడులో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేస్తానని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ఎంపీగా అయినా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా అయినా పోటీ చేస్తానని పేర్కొన్నారు. తనకు టీడీపీలో సరైన న్యాయం చేయలేదన్నారు.
ఎంపీ గల్లా జయదేవ్ తనపైన మాట్లాడాల్సిన మాటలు కాదని, టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు తనపై విమర్శలు చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగట్లేదని తెలిసి వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తానన్నారు. గతంలో పార్లమెంటులో తనపై దాడి చేస్తే తనకు మద్దతుగా నిలవకపోగా నిందలు వేశారని ఆవేదన వెలిబుచ్చారు. తనలాంటి వ్యక్తికి టీడీపీలో టికెట్ లేదనడం వారికే సిగ్గుచేటన్నారు. గల్లా గుంటూరుకు అతిథిలాంటివారని, ఆయనకు బ్యాలెట్ పేపర్‌తో బుద్ధి చెపుతామని అన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడానికి వచ్చామని, జగన్ గెలుపు ఖాయమని చెప్పారు.
జగన్ ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరం: దాడి
నాలుగేళ్ల తర్వాత వైఎస్సార్‌సీపీలోకి రావడం సొంతగృహానికి వచ్చినట్టుగా ఉందని దాడి వీరభద్రరావు అన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఆయన ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం మంచి పాలనను అందించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. పాలనను చంద్రబాబు గాలికొదిలేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ప్రజలు గుర్తుకొచ్చి పప్పు, బెల్లాలు పంచి ఓట్లు పడతాయని ఆశిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ప్రజలు తెలివితక్కువ వారని, గతం మరుస్తారని, తనను నమ్ముతారని చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రజలు ఇలాంటివి చాలా చూశారు. విజయభాస్కరరెడ్డి హయాం నుంచి చూస్తున్నారు.
ఎన్టీఆర్ టీడీపీ పెడుతున్నపుడు రూ.2 కిలో బియ్యం అంటే కోట్ల విజయభాస్కరరెడ్డి రూ.1.90కి కిలో బియ్యం ఇస్తానన్నా ప్రజలు ఆయన జిమ్మిక్కులను నమ్మలేదు’’ అని గుర్తు చేశారు. టీడీపీని చంద్రబాబు తెలుగు కాంగ్రెస్‌గా మార్చారని, కాంగ్రెస్‌కు అనుబంధ సంస్థగా తయారు చేశారని దాడి విమర్శించారు. టీడీపీని ఎవ్వరు పరిపాలిస్తున్నారో అర్థం కావట్లేదని టీడీపీ అభిమానులు బాధపడుతున్నారన్నారు. టీడీపీ జాతీయ గౌరవాధ్యక్షులుగా రాహుల్ ఉన్నారా, చంద్రబాబు ఉంటారా.. అనుమానంగా ఉందన్నారు. ఏ క్షణంలోనైనా టీడీపీని కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసే పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పాలన పోవటం, జగన్ పాలన రావటం చరిత్రాత్మక అవసరమన్నారు. కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల పార్టీకి దూరంగా ఉన్నానని, ఏ రకంగా పార్టీ ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడతానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని, పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో తానుగానీ, తన కుమారుడు రత్నాకర్‌గానీ బరిలో ఉంటామన్నారు.
మంత్రి సునీతకు షాక్
అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుక్కచర్ల నల్లప్పరెడ్డి, ఆయన సోదరులు వీరారెడ్డి, సుబ్బారెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. గణనీయమైన అనుచరగణం గల ఈ సోదరులు టీడీపీని వీడటం మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ నాలుగోతరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు యు.కుళ్లాయప్ప, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్‌యాదవ్ కూడా పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment