
‘బాహుబలి’ దున్నకు బహు కష్టం
సినీ పరిశ్రమలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలుగు చలన చిత్రం ‘బాహుబలి’లో నటించిన దున్నకు కష్టం వచ్చింది.
గోశాలలో తిండిలేక అవస్థలు పడుతున్న వైనం
రాజాపేట: సినీ పరిశ్రమలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలుగు చలన చిత్రం ‘బాహుబలి’లో నటించిన దున్నకు కష్టం వచ్చింది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అధునాతన టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమాలో నటించిన దున్నపోతుకు అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. చివరకు యుద్ధ సన్నివేశంలో రానా బలిచ్చే సన్నివేశంలో అదే దున్నపోతు కనిపిస్తుంది. ఈ దున్నపోతుకు ప్రస్తుతం తిండి కరువైంది.
షూటింగ్ పూర్తయిన అనంతరం దాన్ని రాఘవేంద్రస్వామి మంత్రాలయానికి బహూకరించారు. అక్కడ ఏమైందో ఏమోగాని ప్రస్తుతం నల్లగొండ జిల్లా రాజాపేట మండలం చల్లూరులో ఉన్న సహయోగ్ గోశాలలో తలదాచుకుంటోంది. రోజువారీగా తిండి సైతం లేక ప్రస్తుతం ‘బహుబలి’ దున్న అష్టకష్టాలు పడుతోంది.