రిలయన్స్ జియోకు ట్రాయ్ షాక్
రిలయన్స్ జియోకు ట్రాయ్ షాక్
Published Fri, Oct 14 2016 9:57 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
న్యూఢిల్లీ : ఉచిత వాయిస్ కాల్ ఆఫర్లపై వివరణ ఇవ్వాల్సిందేనని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు షాకిచ్చింది. రెగ్యులేటరీకి సమర్పించిన నివేదికలో వాయిస్ టారిఫ్ ప్లాన్ నిమిషానికి 1.20పైసలుండగా.. ఉచిత కాలింగ్ ఆఫర్ను ఎలా అందిస్తాన్నారో తెలుపాల్సిందేనని ట్రాయ్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ రెండింటికీ చాలా తేడా ఉన్నట్టు దీనిపై వివరణ కావాలంటూ ట్రాయ్ కోరినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంపై సీనియర్ ట్రాయ్ అధికారులు, రిలయన్స్ జియో ఎగ్జిక్యూటివ్లతో భేటీ అయినట్టు తెలిపాయి. కంపెనీ అందించే టారిఫ్ ప్లాన్ వివరాలు కోరినట్టు, ఈ విషయంపై ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నట్టు చెప్పాయి.
కాల్ ప్లాన్ కింద రెగ్యులేటరీ ఫైలింగ్లో సెకనుకు 2 పైసలు చార్జ్ చేస్తామని రిలయన్స్ జియో తెలిపింది. అంటే నిమిషానికి 1.20 పైసలన్నమాట. సిమ్ కార్డ్ బ్రోచర్స్పైనే కూడా కస్టమర్లకు ఇదే కనిపిస్తుంది. అయితే ఉచిత కాల్స్ ప్రకటనకు, రెగ్యులేటరీ సమర్పణకు టారిఫ్ ప్లాన్స్లో తేడాపై రిలయన్స్ జియో స్పందించడంలేదు. దీనిపై కంపెనీ దగ్గర ఎలాంటి సమాధానం లేదని పలు టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు 2004లో టెలికాం రెగ్యులేటరీ తయారుచేసిన టెలికాం టారిఫ్ ప్లాన్ను సైతం రిలయన్స్ జియో సవరించనుందని తెలుస్తోంది. ఈ టారిఫ్ ఫ్లాన్ ప్రకారం టెలికాం కంపెనీలు ఇంటర్కనెక్ట్ యూజర్ చార్జీల(ఐయూసీ) కంటే తక్కువగా టారిఫ్లు ఉండటానికి ఇష్టపడవు. ప్రస్తుతం ఐయూసీ రేట్ నిమిషానికి 14 పైసలుగా ఉంది. ఉచిత వాయిస్ కాల్స్ ఆఫర్స్తో రిలయన్స్ జియో దోపిడీ పద్ధతులకు తెరతీసిందని ఇతర టెలికాం కంపెనీలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.
Advertisement
Advertisement