
మనం కలిసుందాం.. వాళ్లను కుమ్మేద్దాం!
మాస్కో/వాషింగ్టన్: దాదాపు గంటపాటు జరిపిన ఫోన్ సంభాషణలో అగ్రదేశాధినేతలిద్దరూ ప్రపంచ సమస్యలను చర్చించారు. చివరికి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు.. అమెరికా, రష్యాలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. అదేసమయంలో భూగోళం నుంచి ఉగ్రవాదాన్ని తరిమేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రప్ తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శనివారం ఫోన్‌లో మాట్లాడారు.
ఇద్దరు నేతలు గంటపాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారని, ప్రపంచానికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నట్లు రష్యా అధికార కేంద్రం క్రెమ్లిన్, యూఎస్ అధ్యక్ష భవనం వైట్‌హౌస్ అధికార ప్రతినిధులు మీడియాకు చెప్పారు. అమెరికా-రష్యాల మధ్య సత్సంబంధాల పునరుద్ధారణ ఆవశ్యకమని ఇరునేతలు అభిప్రాయపడ్డట్లు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఐసిస్, సిరియాలో అంతర్యుద్ధం, అంతర్జాతీయ ఉగ్రవాదం, ఉత్తర కొరియా దూకుడు తదితర అంశాలపై ట్రంప్, పుతిన్‌లు చర్చించారని ప్రతినిధులు పేర్కొన్నారు.
అయితే రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ఎత్తివేత గురించి ట్రంప్, పుతిన్ మాట్లాడుకున్నారా లేదా అనేదానిపై ఇరుదేశాల ప్రతినిధులు సమాధానం ఇవ్వలేదు. ఫోన్ చర్చల ఫలితంగా సిరియాలో బాంబుల మోత ఆగుతుందా? లేదా? అనే ప్రశ్నకూ జవాబు దాటవేశారు. కాగా, అతి త్వరలోనే నేరుగా కలుసుకుని చర్చలు జరపాలని ట్రంప్-పుతిన్‌లు నిర్ణయించుకున్నారు. ట్రంప్ రష్యాకు వెళతారా? లేక పుతిన్‌నే అమెరికాకు ఆహ్వానిస్తారా? అనేది ఇప్పుడే చెప్పలేమని క్రెమ్లిన్, వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.