ఆయనతో తప్ప చాలామందితో మాట్లాడాను: ట్రంప్
వాషింగ్టన్: చైనా పట్ల వ్యతిరేకతను ఏమాత్రం దాచుకోని అమెరికా కాబోయే అధ్యక్షుడు (ఎన్నికైన) డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తాను చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో మాట్లాడలేదని ట్రంప్ చెప్పారు. జిన్ పింగ్‌తో మాట్లాడినట్టు మీడియాలో వచ్చిన కథనాలను తోసిపుచ్చారు. చైనా అధ్యక్షుడితో తప్ప చాలా మంది ప్రపంచ నేతలతో మాట్లాడానని, అభినందనలు అందుకున్నానని చెప్పారు.
ట్రంప్ విజయం సాధించాక చైనా అధ్యక్షుడు ఫోన్ చేసి ఆయన్ను అభినందించినట్టు చైనా సెంట్రల్ టీవీ వెల్లడించింది. ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందించానని, ఇరు దేశాలు కలసి పనిచేయాల్సిన అవసరముందని చెప్పానని జిన్ పింగ్ తెలిపారంటూ ఆ టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. చైనా-అమెరికా సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అభివృద్ధి దిశగా దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని ట్రంప్‌తో జిన్ పింగ్ చెప్పినట‍్టు వెల్లడించింది. అలాగే ఇరు దేశాల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారని చైనా సెంట్రల్ టీవీ పేర్కొంది.
కాగా వాల్ స్ట్రీట్ జర్నల్‌తో ట్రంప్ మాట్లాడుతూ.. చైనా అధ్యక్షుడితో తప్ప చాలా మంది ప్రపంచ నేతల నుంచి అభినందనలు అందుకున్నానని చెప్పారు. ట్రంప్ ప్రతినిధి హోప్ హిక్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎన్నికలకు ముందు ఓ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. చైనా అమెరికా ఉద్యోగాలను దోచుకుంటోందని, తమ దేశాన్ని అత్యాచారం చేస్తోందని, ఇకమీదట సాగబోదని తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా సంబంధాలు ఎలా ఉండబోతాయన్నది ఇతర దేశాలు గమినిస్తున్నాయి.