ట్విట్టర్ సీఈవోకు షాక్.. అకౌంట్ బ్లాక్!
శాన్‌ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ట్విట్టర్.. సాక్షాత్తూ తన బాస్‌కే షాక్ ఇచ్చింది. ఇటీవలే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డ సంఘటన మరువకముందే ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ అకౌంట్ మళ్లీ బ్లాక్ అయింది. మంగళవారం రాత్రి ట్విట్టర్ లో ఆయనను వెదికినవారికి ‘ప్రస్తుతం ఈ ఖాతా రద్దైంది’అనే సమాచారం కనిపించింది. దీంతో ఆయన ఫాలోవర్లేకాక పలువురు యూజర్లూ ఆందోళన చెందారు. అసలేం జరిగిందో కొన్ని గంటల తర్వాత డార్సీనే వివరణ ఇచ్చారు..
సిబ్బంది చేసిన చిన్న సాంకేతిక పొరపాటు వల్ల తన ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అయిందని, వెంటనే వాళ్లతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టానని జాక్ డార్సీ ట్విట్టర్ లో తెలిపారు. సంస్థ సీఈవోకు ఎదురైన అనుభవం తమలో కొద్ది మందికి తరచూ ఎదురవుతున్నదని, ఉన్నపళంగా అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయని, దీనిపై ట్విట్టర్ సమాధానం చెప్పాల్సిందేనని కొందరు ట్విట్టరియన్స్ డిమాండ్ చేశారు. అయితే ట్విట్టర్ సంస్థ మాత్రం ఈ ఉదంతంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ట్విట్టర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్ డార్సీ సంస్థకు తొలి సీఈవో కూడా. కొంత కాలానికి రాజీనామా చేసి వెళ్లిపోయిన ఆయన.. గతేడాది తిరిగి ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆయనతోపాటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌ల ట్విట్టర్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన సంగతి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన తెలిసిందే.
just setting up my twttr…again (account suspension was an internal mistake)
—