ఇద్దరు ఐఐటీ ప్రొఫెసర్ల అరెస్టు
నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన కేసులో ఐఐటీ రూర్కీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిషాలోని తేహ్రి జిల్లాలో మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. విజయ్ ప్రకాష్, విజయ్ కుమార్ గుప్తా అనే ఇద్దరూ ఐఐటీ రూర్కీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్లు. వాళ్లను వాళ్ల వాళ్ల అపార్టుమెంట్ల నుంచే పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. గతంలో కోర్టు నుంచి సమన్లు వచ్చినా హాజరు కాకపోవడంతో వారిపై నాన్ బెయిలబుల్ వారంటు జారీ అయ్యింది.
తేహ్రి జిల్లాలోని చౌరస్ ప్రాంతం వద్ద అలకనందా నదిపై వంతెన నిర్మాణానికి ఈ ప్రొఫెసర్లిద్దరూ డిజైన్ రూపొందించారు. అయితే, అది లోపభూయిష్టంగా ఉండటంతో వంతెన ఇంకా పూర్తి కాకముందే 2012లో కూలిపోయింది. ఎనిమిది మంది మరణించగా, వారిలో ఒక జూనియర్ ఇంజనీర్ కూడా ఉన్నారు. వంతెన కడుతున్న రెండు నిర్మాణ కంపెనీల యజమానులను కూడా ఇప్పటికే అరెస్టు చేశారు.