దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక పాత్ర పోషిస్తుంది. అయితే భారతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏటా పట్టభద్రులవుతున్న సుమారు 15 లక్షల మంది విద్యార్థులలో అత్యధికులకు ఉద్యోగార్హ ప్రమాణాలు కొరవడుతున్నాయన్న విమర్శ ఉంది. అంతర్జాతీయంగా వస్తున్న అధునాతన సాంకేతిక మార్పులు, ఉన్నత ప్రమాణాలను అందిపుచ్చుకోవడంలో దేశీయ ఇంజనీరింగ్ కళాశాలలు విఫలం అవుతున్నాయన్న మాటలో కొంతైనా వాస్తవం లేకపోలేదు. ప్రపంచంలో అమెరికా తరువాత ఎక్కువ మంది ఆంగ్లం మాట్లాడేది భారతదేశంలోనే.
అయినా, ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో భారత్ తీసికట్టుగా ఉంది. స్వాతంత్య్రం అనంతరం మన ఉన్నత విద్య ప్రపంచ ప్రమాణాలకు దీటుగా ఎదగకపోవడమే దీనికి కారణం. పూర్వం భారత్‌లోని నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసానికి ఇతర దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. కానీ, నాటి ప్రమాణాలు నేడు లేవు. మన ఇంజినీరింగ్ విద్యాలయాలు కేవలం బోధనతోనే సరిపెట్టుకోకుండా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలతో అనుసంధానం కావాలి.
ప్రపంచంలో అమెరికా, చైనాల తరవాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఇండియా ధ్యేయంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని 2030–32 నాటికి అందుకోవాలని భావిస్తోంది. అప్పటికి భారత్ 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగితేనే అనుకున్న లక్ష్యం సాధించగలుగుతుంది. బలమైన విద్యావ్యవస్థ పునాదిపై అధునాతన విజ్ఞానాధారిత సమాజాన్ని నిర్మించడం ద్వారానే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment