పాండే తిరగబడటానికి తక్షణ కారణం.. కొత్త ఎన్‌ఫీల్డ్ తుపాకులలో వాడేందుకు సిపాయిలకు బ్రిటిష్ ఆర్మీ పంపిణీ చేసిన తూటా గుళిక (క్యాట్రిడ్జ్) లేనని, సాఫీగా జారేందుకు వీలుగా ఆ గుళికలకు జంతువుల కొవ్వుతో తయారు చేసిన గ్రీజును అద్ది ఇవ్వడం వల్లనే పాండే మత మనోభావాలు తీవ్రంగా గాయపడి తన పైఅధికారులపై బహిరంగంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడని బ్రిటిష్ చరిత్రకారులు రాశారు. నిజమేనా? అసలు ఆ రోజు ఏం జరిగింది?
ఆ ఘటన జరిగినప్పుడు పాండేతో పాటు అక్కడ అవథ్ బ్రాహ్మణ సిపాయిలు కూడా ఉన్నారు. బ్రిటిష్ వారి అప్రాచ్య విధానాల వల్ల తమ కులం, మతం మంట కలిసిపోతాయని వారంతా భయపడ్డారు. పాండే తుపాకీ ఒక్కటే నిర్భయంగా పైకి లేచింది. దానిని గాలిలో ఊపుతూ.. ‘‘అంతా బయటికి వచ్చేయండి. ఈ తూటాల క్యాట్రిడ్జ్‌లను నోటితో తెరిచామంటే మనం మత విశ్వాస ఘాతకులం అయినట్లే. ఇంకా ఆలోచిస్తారేమిటి? యూరోపియన్‌ల పని పడదాం రండి’’ అని అరిచాడు. అంతేకాదు, ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు బ్రిటిష్ అధికారులు.. సార్జెంట్ హ్యూసన్, లెఫ్ట్‌నెంట్ బాగ్‌లతో కూడా పాండే తలపడి తన కత్తితో, తుపాకీతో వారిని గాయపరిచాడు. ఆ గొడవకి ప్రెసిడెన్సీ విభాగం కమాండింగ్ ఆఫీసర్ జనరల్ హియర్సే అక్కడి రాగానే పాండే తనని తాను కాల్చుకున్నాడు. అయితే ఆ తూటా అతడిని చంపే విధంగా తగల్లేదు.
ఈ ఘటనంతా కొన్ని చరిత్ర పుస్తకాలలో మరింత వివరంగా ఉంది. ఆవు కొవ్వు, పంది కొవ్వు ఉపయోగించి తయారు చేసిన క్యాట్రిడ్జ్‌లను కొరికి ప్రయోగించడానికి నిరాకరించిన మంగళ్ పాండే, ఆ కోపంలో తన పై అధికారిని హతమార్చాడు. షేక్ పల్టూ అనే సహ సిపాయి పాండేను వారించే ప్రయత్నం చేశాడు. ఈ కలకలం చెవిన పడి అక్కడికి చేరుకున్న జనరల్ హెర్పే.. పాండేను పట్టుకోమని జమాదార్ ఈశ్వరీ ప్రసాద్‌ను ఆదేశించారు. ప్రసాద్ కదల్లేదు. ఈలోపు పాండే తన తుపాకితో తనే కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించి విఫలమయ్యాడు.
బ్రిటిష్ సైనికులు వెంటనే అతడిని నిర్బంధించి హత్యానేరం మోపారు. సైనిక న్యాయస్థానం పాండేను ఏప్రిల్ 18 న ఉరి తీయాలని తీర్పు చెప్పింది. అయితే 10 రోజుల ముందుగానే అతడిని ఉరి తీశారు. అతడిని పట్టుకునేందుకు చొరవ చూపని ఈశ్వరీ ప్రసాద్‌ను కూడా రెండు వారాల తర్వాత ఏప్రిల్ 22న ఉరి తీశారు. పాండే తిరుగుబాటు చేస్తున్నప్పుడు చూస్తూ నిలబడిపోయారన్న ఆరోపణలపై తక్కిన సిపాయిల దుస్తులు విప్పించి పరేడ్ చేయించారు. మంగల్ పాండేను అడ్డుకుని, బ్రిటిష్ అధికారులను రక్షించేందుకు ప్రయత్నించిన షేక్ పల్టూకి పదోన్నతి లభించింది.
కాలక్రమంలో పాండే భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ప్రేరణ కలిగించిన తొలి తిరుగుబాటు సిపాయిగా చరిత్రలో నిలిచిపోయాడు. అతడు మరణించిన 148 ఏళ్ల తర్వాత 2005లో బరక్‌పూర్ (పశ్చిమ బెంగాల్) స్థానిక పాలన మండలి ఊరి నడిబొడ్డున పాండే విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఆ ఊరిలోని ఆర్మీ బ్యారక్‌ల మధ్య ఏర్పాటు చేసిన ఆ విగ్రహం రూపంలో పాండే ఒంటరి యోధుడిలా కనిపిస్తాడు. ఛాతీ వరకు ఉన్న ఆ స్మారక విగ్రహం కింద ‘మంగళ్‌పాండే, సిపాయి నెం.1446, 34 వ రెజిమెంట్. 1858 మార్చి 29న పట్టపగలు బ్రిటిష్ అధికారులపై ఇతడు తుపాకీ పేల్చాడు’ అని రాసి ఉంటుంది. ‘‘ఈ విగ్రహాన్ని పెట్టేవరకు పాండే ఎలా ఉంటాడో మాకూ తెలీదు’’అని ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారితో స్థానికులు చెబుతుంటారు.
తిరుగుబాటు జరిగిన వారం లోపలే పాండేపై విచారణ జరిగింది.
భంగు, నల్లమందు తీసుకోవడం వల్ల ఆ మత్తులో ఏం చేస్తున్నదీ తనకు తెలియలేదని పాండే చేత బలప్రయోగంతో చెప్పించి, అతడికి మరణశిక్ష విధించారు. ఏప్రిల్ 8న ఉరికొయ్యల దగ్గరికి వెళుతున్నప్పుడు కూడా అతడిలోని గాంభీర్యం సడల్లేదని కొందరు చరిత్రకారులు రాశారు. బరక్‌పూర్‌లోని ఒక మర్రిచెట్టుకి పాండేని ఉరి తీశారని చెబుతారు. ‘‘ఆ చెట్టు ఇప్పటికీ ఇక్కడి పోలీసు శిబిర ప్రాంగణంలో ఉంది. అయితే లోపలికి ఎవరినీ అనుమతించరు. దాని గురించి వినడం వరకే..’’ అంటారు బరక్‌పూర్ గ్రామస్థులు. కనిపించే విగ్రహం, కనిపించని ఉరికొయ్య.. ఈ రెండే అక్కడ మిగిలి ఉన్న మంగళ్ పాండే స్మృతి చిహ్నాలు. పదిహేడేళ్ల క్రితం 2005లో పాండే మాట మళ్లీ ఒకసారి దేశంలో ఉత్తేజాన్ని నింపింది. పాండేగా అమీర్‌ఖాన్ నటించిన ‘ది రైజింగ్ : బ్యాలెడ్ ఆఫ్ మంగళ్ పాండే’ చిత్రం ఆ ఏడాది విడుదలైంది.
1857 మే 10న జరిగిన సిపాయిల తిరుగుబాటుకు బీజాలు వేసింది మార్చి 29 నాటి పాండే ధైర్యసాహసాలేనా అనే విషయమై చరిత్రకారులు నేటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ‘బ్రేవ్ మార్టిర్ ఆర్ యాక్సిడెంటల్ హీరో’ పుస్తక రచయిత రుద్రాంక్షు ముఖర్జీ.. పాండేను దేశభక్తుడిగా గుర్తించలేమని, భారత తొలి స్వాతంత్య్ర సమరారంభానికి, పాండే తిరుగుబాటుకు సంబంధమే లేదని రాశారు!
ఎవరేం రాసినా, తిరుగుబాటు భావాలకు ప్రతీకశక్తి మాత్రం భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో పాండే ఒక్కడే. అయితే బయటి నుంచి చూసే వారి దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. దానినీ ఆహ్వానించాలి. చరిత్రలో ఏం జరిగిందన్న వాస్తవం యథాతథంగా ప్రజలకు కావాలి. అందుకోసం చిన్న చిన్న అంశాలను కూడా చరిత్ర పరిశోధకులు వెలుగులోకి తేవాలి. అప్పుడే సంపూర్ణ వాస్తవానికి మరింత సమీపంగా వెళ్లగలం.
Comments
Please login to add a commentAdd a comment