ఓలాకు పోటీగా ఉబర్ కొత్త సర్వీసు
ఓలాకు పోటీగా ఉబర్ కొత్త సర్వీసు
Published Mon, Feb 6 2017 3:26 PM | Last Updated on Thu, Aug 30 2018 9:05 PM
న్యూఢిల్లీ : దేశీయ ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా రెంటల్స్కు పోటీగా శాన్ఫ్రాన్సిస్కో దిగ్గజం ఉబర్ ఓ కొత్త సర్వీసును ప్రారంభించింది. ఆన్డిమాండ్ క్యాబ్ సర్వీసుల కోసం 'ఉబర్ హైర్' ను సోమవారం యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. ఈ సర్వీసులతో ఇక నుంచి ఉబర్ క్యాబ్ను 12 గంటల పాటు అద్దెకు తీసుకోవచ్చు. కాంచిలో విజయం పొందిన ఈ సర్వీసులను మరో ఎనిమిది సిటీల్లో ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబాయి, పుణే, అహ్మదాబాద్, వైజాగ్, నాగ్పూర్లో వీటిని లాంచ్ చేస్తున్నట్టు తెలిపింది. ఇతర సిటీల్లోకి కూడా ఈ సర్వీసులను విస్తరిస్తామంది.
ఈ సర్వీసులకు కనీస ఛార్జీలు రెండు గంటల వరకు, 30 కిలోమీటర్ల వరకు రూ.449 ఉంటాయి. మొత్తం ఛార్జీని ఉబర్ క్యాబ్లో ప్రయాణం మొత్తం పూర్తయిన తర్వాత, దూరం, ట్రిప్పు సమయం బట్టి లెక్కించనున్నారు. రైడర్స్ రాకపోకల అవసరాలకు అనుగుణంగా దీన్ని ప్రారంభించామని ఉబర్ ఇండియాకు ఇంజనీరింగ్ అధినేత అపూర్వ దలాల్ తెలిపారు. టూరిస్టులకు, బిజినెస్ ట్రావెలర్స్కు, సీనియర్ సిటిజన్లకు, వర్కింగ్ ప్రొఫిషన్లకు ఇది ఎంతో సహకరించనుందని పేర్కొన్నారు. ఓలా లాంటి ఇతర ట్యాక్సీ కంపెనీలు కూడా అవర్లీ క్యాబ్ రెంటల్స్ను నడుపుతున్న సంగతి తెలిసిందే.
Advertisement