ఫుడ్ సర్వీసుల్లోకి ఉబర్
క్యాబ్ సర్వీసుల్లో దూసుకెళ్తున్న ఉబర్ టెక్నాలజీస్ మరో సరికొత్త సర్వీసులతో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఉబర్ ఈట్స్ పేరుతో ఫుడ్ డెలివరీ సర్వీసుల్లోకి అరంగేట్రం చేసింది.ఇప్పటికే ఈ సర్వీసులను ఆమ్స్టర్డామ్లో ప్రారంభించిన ఉబర్, జపాన్, టోక్యోల్లో కూడా ఈ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఓ వైపు జపాన్లో టాక్సీ డ్రైవర్ల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఆ దేశంలో ఉబర్ సర్వీసులు ఆగిపోయాయి. కొత్తగా ఆ దేశంలో ఫుడ్ డెలివరీ సర్వీసులను ఆవిష్కరించి లబ్ది పొందాలని ఉబర్ భావిస్తోంది.
జపాన్ మార్కెట్ వారికెంతో ప్రముఖమైనదని, ఆ దేశంలో ఫుడ్ డెలివరీ సర్వీసులు విజయవంతమైతే, ఇతర ఆసియా మార్కెట్లో కూడా ఈ సేవలు ఊపందుకుంటాయని శాన్ఫ్రాన్సిస్కోలో ఓ డిజిటల్ విశ్లేషకుడు బ్రియాన్ సోలిస్ తెలిపారు. ఉబర్ ఈట్స్ పేరుతో జపాన్లో ఈ సర్వీసులు లాంచ్ అయితే కంపెనీకి 2014లో ఉన్న మార్కెట్ రెండింతలు పెరిగి 19 బిలియన్ డాలర్లుగా నమోదవుతుందని యానో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంటోంది. కొత్త పుంతలు తొక్కుతూ వస్తున్న ఈ సర్వీసులు త్వరలో 22 దేశాల్లో విస్తరించాలని ఉబర్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. వీటిల్లో ఆరు దేశాలు ఉబర్ క్యాబ్‌సర్వీసులకు ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి.ఉబర్ మేలో తన ప్రధాన వ్యాపార మార్గాలను విస్తరించాలని భావించింది. దీనిలో భాగంగా ఉబర్‌ఈట్స్‌ను ప్రారంభించింది.