'బీజేపీది బలుపు కాదు.. వాపు'
ముంబై: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీపై దాని మిత్రపక్షం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విజయాన్ని తాము గౌరవిస్తున్నామని ఓ వైపు చెబుతూనే మరోవైపు ఈ పెరిగిన సంఖ్య బలం బలుపుకాదు.. తాత్కాలిక వాపు అని అభివర్ణించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ...కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఐఎంలతో రహస్య ఒప్పందం చేసుకుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రహస్య ఒప్పందం కారణంగానే బీజేపీకి లాభం చేకూరిందని, తాము కూడా అలాగే చేసినట్లయితే తమ సంఖ్యా బలం కూడా మరింత పెరిగేదని బీజేపీపై చురకలంటించారు.
సామ్నా దినపత్రిక బుధవారం సంపాదకీయంలో తనదైన శైలిలో ఎన్నికల ఫలితాలపై బీజేపీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలోని మినీ అసెంబ్లీగా పేర్కొనే మున్సిపాలిటీ, నగరపంచాయతీ ఎన్నికల్లో 52 మున్సిపల్ చైర్మన్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా శివసేన 25 మున్సిపల్ చెర్మైన్ స్థానాలలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయం ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజలు తెలిపిన మద్దతు లాంటిదని బీజేపీ నేతలు పేర్కొనడాన్ని ఉద్ధవ్.. మూర్ఖత్వమన్నారు. నోట్ల రద్దు నిర్ణయం కారణంగా వీరు గెలిచుంటే 100కుపైగా నగరాధ్యక్ష పదవులు బీజేపీకి లభించి ఉండేవన్నారు. మరోవైపు శివసేన కేవలం ప్రజల ఆదరణతోనే గెలిచిందని చెప్పారు.