ఒక్కసారిగా పైకి జంప్ చేసిన మార్కెట్లు
ఒక్కసారిగా పైకి జంప్ చేసిన మార్కెట్లు
Published Wed, Feb 1 2017 2:00 PM | Last Updated on Mon, Aug 20 2018 5:20 PM
ముంబై : కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చేసింది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ప్రవేశపెట్టారు. రెండు గంటల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగ నేపథ్యంలో స్వల్పంగా లాభపడుతూ వచ్చిన మార్కెట్లు, కొద్ది సేపట్లో బడ్జెట్ ప్రసంగం ముగుస్తుందనగా ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి.. సెన్సెక్స్ ఒక్కసారిగా 300 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 255.58 పాయింట్ల లాభంలో 27,911 వద్ద, నిఫ్టీ 66.10 పాయింట్ల లాభంలో 8,627 వద్ద ట్రేడవుతున్నాయి. ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్టర్లు ఊపిరిపీల్చుకున్నాయి.
ఎస్టీటీ, ఇతర పన్నులను ఆయన టచ్ చేయలేదు. ప్రస్తుతం లిస్టెడ్ సెక్యూరిటీ విక్రయాలకు సంబంధించిన 'దీర్ఘకాలిక మూలధన లాభాలు' (ఎల్‌టీసీజీ) పన్ను మినహాయింపు పరిధిలో ఉన్నాయి. ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం వాటాలను తమ పరిధిలో ఉంచుకొని ఆ తరువాత విక్రయించడం ద్వారా వచ్చే లాభాలను ఇంత కాలం ఎల్‌టీసీజీగా పరిగణిస్తూ వస్తున్నారు. మరోవైపు 12 నెలల కంటే తక్కువ కాలంలోనే విక్రయించే స్టాక్ లాభాలపై 15 శాతం వరకు పన్నును విధిస్తూ వస్తున్నారు. దీనిని 'స్వల్పకాలిక మూలధన లాభాలు' (ఎస్‌టీసీజీ)గా పరిగణిస్తున్నారు.
హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్ తీసుకురావడంతో బీఎస్ఈలో రియాల్టీ ఇండెక్స్ దూసుకెళ్తోంది. 3.33 శాతం మేర ఈ సూచీ జంప్ చేసింది. బ్యాంకింగ్, పీఎస్యూ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు సైతం లాభాల్లో నడుస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ మాత్రం నష్టాల్లోనే కొనసాగుతోంది. సెన్సెక్స్లో టాప్ గెయినర్లుగా ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, గెయిల్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీలున్నాయి.
Advertisement