
కేంద్ర బడ్జెట్ వాయిదా..?
కేరళలోని మళప్పురం పార్లమెంట్ స్థానం సిట్టింగ్ ఎంపీ ఇ. అహ్మద్ ఆకస్మిక మరణం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిన్న(మంగళవారం) పార్లమెంట్ సెంట్రల్ హాలులో గుండెపోటుకు గురై, ఆస్పత్రిలో చేరిన ఎంపీ అహ్మద్.. బుధవారం తెల్లవారుజామున రెండుగంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే అహ్మద్ కిందపడిపోయారు. దీంతో సిబ్బంది ఆయనను రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. కొద్ది గంటల చికిత్స అనంతర బుధవారం ఉదయం2:30 గంటల సమయంలో అహ్మద్ కన్నువూశారు.
పార్లమెంట్ నిబంధనల ప్రకారం సిట్టింగ్ ఎంపీ చనిపోయిన సందర్భాలలో ఉభయసభలలోనూ ఆయన/ఆమె కు అంజలిఘటిస్తారు. రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం సభ ఒకరోజుకు వాయిదా వేస్తారు. బడ్జెట్ వాయిదా వార్తలపై పై ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోశ్ గాంగ్వర్ స్పందించారు. ‘ఎంపీలు చనిపోయినప్పుడు సభను వాయిదా వేడయం ఆనవాయితీనే. అయితే తుది నిర్ణయం మాత్రం స్పీకర్‌దే’అని గాంగ్వర్ అన్నారు.
సాధారణంగా సమావేశాలు లేని సందర్భంలోనూ ఎంపీలు ఎవరైనా చనిపోతే, ఆ సీజన్‌లో సభ ప్రారంభమైన మొదటిరోజే మృతులకు నివాళులు అర్పించిన పిదప సభను వాయిదావేస్తారు. గత ఏడాది వేసవి కాల సమావేశాల్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. షహదోల్(మధ్యప్రదేశ్) నియోజకవర్గ ఎంపీ దళ్‌పత్ సింగ్ పరాస్తే జూన్ 1న కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపకంగా వేసవికాల సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే నివాళులు అర్పించి, సభను వాయిదావేశారు.
మలప్పురం ఎంపీ ఇ.అహ్మద్ పార్లమెంట్ హాలులోనే అస్వస్థతకుగురై, ఆస్పత్రిలో కన్నుమూశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వంలో అహ్మద్ విదేశాంగ శాఖ సహాయమంత్రిగానూ పనిచేశారు. ఎంపీ అహ్మద్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు.
‘పశ్చిమ ఆసియా’పై ఆయనది కీలక పాత్ర: ప్రధాని మోదీ
రాజకీయరంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అహ్మద్ కేరళ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని, ఆయన మరణం తీవ్ర వేదన కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. విదేశాంగ మంత్రిగా పశ్చిమ ఆసియా దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో అహ్మద్ కీలక పాత్ర పోశించారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. చురుకైన రాజకీయవేత్తగా అహ్మద్ పేరుతెచ్చుకున్నారని, ఆయన అకాలమరణం బాధకుగురిచేసిందని అన్నారు.
(పార్లమెంట్‌లో పడిపోయిన ఎంపీ.. ఆస్పత్రికి తరలింపు)