
రాష్ట్రంలో రెండోసారి
రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ సిఫారసు
రాష్ట్రపతికి నివేదించిన షిండే.. ఇక ప్రణబ్ ఆమోదమే తరువాయి
సుప్తచేతనావస్థలో శాసనసభ.. జూన్ 2 వరకూ ప్రాణమున్నట్టే
ఆలోపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం సజీవం
కాంగ్రెస్‌లో లుకలుకలు బయటపడతాయనే అధిష్టానం వెనకంజ!
ఇక ఎన్నికల తర్వాతే రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటు?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటంపై సుదీర్ఘంగా తర్జనభర్జనలు పడ్డ కాంగ్రెస్ పార్టీ చివరకు చేతులు ఎత్తేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. అలాగే.. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచాలని కూడా రాష్ట్రపతికి నివేదించింది. శుక్రవారం ఉదయం 10.40 గంటల నుంచి గంట పాటు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి మంత్రివర్గ సిఫారసును ఆయనకు నివేదించారు. కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించగానే రాష్ట్ర పాలన పగ్గాలు గవర్నర్ చేతికి అందనున్నాయి. రాష్ట్రపతి పాలన ఉన్నన్ని రోజులూ రాష్ట్రానికి సంబంధించిన పాలనా కార్యక్రమాలన్నీ.. రాష్ట్రపతి, గవర్నర్‌ల ద్వారా కేంద్రమే నడిపించనుంది.
సర్కారు ఏర్పాటు అవకాశం సజీవం
రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదముద్ర వేసే వరకు అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం ద్వారా
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గతంలో సుప్రీంకోర్టు ఒక కేసులో ఇచ్చిన తీర్పు మేరకు.. రాష్ట్ర అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచాలని కేంద్రం సిఫారసు చేసింది. అంటే.. అసెంబ్లీ రద్దుకాకుండా నిద్రాణ స్థితిలో ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీకి జూన్ 2 వరకు గడువు ఉంది. ఈలోగా ఎప్పుడైనా రాష్ట్రపతి పాలనను తొలగించి తిరిగి ఇదే సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అనంతరం కూడా కేంద్రం ఇదే రీతిలో వ్యవహరించింది.
గవర్నర్ నివేదికతో నిర్ణయం: ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజు.. కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం గవర్నర్ కోరిక మేరకు ఆయన ఇప్పటివరకు ఆపధ్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ముఖ్యమంత్రి రాజీనామా విషయాన్ని గవర్నర్ ప్రతిపక్షాల నేతలకు సమాచారమిచ్చారు.
అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై ఆలోచించాలని కూడా కోరారు. కానీ అధికార కాంగ్రెస్ సహా ఏ పక్షమూ సర్కారు ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో గవర్నర్ ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించారు. హోంశాఖ నివేదన మేరకు కేంద్ర కేబినెట్ శుక్రవారం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది రెండోసారి. తొలిసారి 1973 జనవరి 11 నుంచి 1973 డిసెంబరు 10 వరకు 11 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడు రాష్ట్రముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు ఉన్నారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా శాంతిభద్రతలు అదుపు తప్పటంతో అనివార్య పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒకసారి రాష్ట్రపతి పాలన విధించారు. 1954 నవంబర్ 15 నుంచి 1955 మార్చి 29 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేంద్రం ఇప్పటివరకు సుమారు 120 సార్లు రాష్ట్రపతి పాలన విధించింది.
జూన్ 1న కొత్త రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు!
రాష్ట్ర విభజన నేపథ్యంలో పంపకాలు, ఇతరత్రా అంశాల్లో పార్టీ చేతికి మట్టి అంటకుండా చేసుకునేందుకు, ప్రభుత్వ వ్యతిరేకత ఎన్నికల వరకు కొనసాగకుండా ఉండేందుకు ఈ తాజా నిర్ణయం దోహదపడుతుందన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పెద్దల్లో ఉంది. రాష్ట్ర విభజనను తొలుత ఆగమేఘాలపై ఐదారు రోజుల్లో పూర్తిచేయాలని భావించినా.. హడావుడిగా చేశారన్న అపప్రథ రావటం ఎందుకని మిన్నకుంది. గతంలో రాష్ట్ర విభజనకు కనీసం 90 రోజుల సమయం పట్టిన దాఖలాలు ఉన్న నేపథ్యంలో ఆ విధానాలనే అనుసరించాలని భావించింది. మరోవైపు ప్రస్తుత అసెంబ్లీకి మరో 90 రోజుల గడువు మాత్రమే ఉంది. జూన్ 1 నాటికి ఎన్నికలు పూర్తయి, ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విభజన తేదీ కూడా జూన్ 1నే పెట్టుకుని అప్పుడే రెండు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలు కొలువుదీరేలా చేయొచ్చని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
లుకలుకలు
బయటపడతాయనే భయం?
సాధారణంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుకాని పక్షంలోనే రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేస్తుంది. కానీ రాష్ట్రంలో నాలుగున్నరేళ్లకు పైగా ప్రభుత్వాన్ని నడిపించి.. ఇప్పటికీ అత్యధిక సభ్యులు గల పార్టీగా ఉన్న కాంగ్రెస్.. రాష్ట్రంలో తమ నేతల్లో ఉన్న అనైక్యత, పార్టీ నుంచి వలసల కారణంగా ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకుంది. అయితే చివరి క్షణంలో కాపు సామాజిక వర్గం వారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి.. ఆ వర్గం వారిని ఆకట్టుకోవాలని వ్యూహం సిద్ధం చేసుకున్నా.. అది నేతల అనైక్యతతో బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుతో పార్టీలో లుకలుకలు బయటపడటం మినహా పెద్దగా ఒరిగేదేమీ లేదని భావించటంతో ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని పక్కనపెట్టేసినట్లు చెప్తున్నారు. ఇక తెలంగాణ, సీమాంధ్రలకు రెండు వేర్వేరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైంది. పైకి మాత్రం ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నందున ఇక ఈ కొద్ది కాలం కోసం ప్రభుత్వ ఏర్పాటు ఎందుకని వ్యాఖ్యానిస్తోంది.