
తరగతి గదిలో దారుణాతి దారుణంగా!
గోండా: హోమ్‌వర్క్ చేయలేదన్న చిన్నకారణంతో టీచర్ రాక్షసుడిగా మారిపోయాడు. ఒళ్లు తెలియని కోపంలో పదేళ్ల పిల్లాడిని దారుణాతి దారుణంగా చితకబాదాడు. నేలకేసి కొట్టి, తన్ని, ఎడాపెడా చెంపలు వాయించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ తరగతి గదిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది.
యూపీ గోండా జిల్లాలోని ఏఐఎంఎస్ ఇంటర్నేషనల్ సెంకడరీ స్కూల్‌లో జరిగిన ఈ ఘటన తాలుకు సీసీటీవీ వీడియో తాజాగా వెలుగుచూసింది. హోమ్‌వర్క్ చేయలేదన్న కారణంతో పదేళ్ల పిల్లాడిపై తరగతిలో విద్యార్థులందరి ముందు వీరంగం వేశాడు ఓ టీచర్. పిల్లాడిని కనికరం లేకుండా అతను బాదుతూ ఉంటే తరగతి గదిలో ఉన్న పిల్లలందరూ అది చూసి షాక్ తిన్నారు. రాక్షసుడిలా ప్రవర్తించిన అతడికి దూరం జరిగారు. ఇలా దారుణంగా ప్రవర్తించిన టీచర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.