సుప్రీం తీర్పులకు తిరస్కారం | UPA Cabinet signs off on move to protect convicted lawmakers | Sakshi
Sakshi News home page

సుప్రీం తీర్పులకు తిరస్కారం

Published Fri, Aug 23 2013 4:26 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

సుప్రీం తీర్పులకు తిరస్కారం - Sakshi

సుప్రీం తీర్పులకు తిరస్కారం

* జైలులో ఉన్నా పోటీకి అర్హులే
* కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
* శిక్ష పడ్డా ఎంపీలు, ఎమ్మెల్యేల సభ్యత్వం పోదు
* ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు
 
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు కీలకమైన తీర్పులను వ్యతిరేకించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చనీయాంశాలుగా ఉన్న అత్యంతకీలకమైన రెండు ప్రతిపాదనలకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జైలులో ఉన్నా ఎన్నికలలో పోటీచేసేందుకు అనుమతివ్వడం అందులో మొదటిది. అప్పీలు పెండింగ్‌లో ఉన్నంత వరకూ శిక్ష పడిన ఎంపీలు, ఎమ్మెల్యేల సభ్యత్వం యథాతథంగా ఉంచడం రెండోది. ఈ రెండు అంశాలపై ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తూ రెండు ప్రత్యేక బిల్లులు రూపొందించి వచ్చేవారం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షపడినా 90రోజుల్లోగా అప్పీలు చేసుకుంటే వారిపై అనర్హత వేటు వేయరాదని చట్టాన్ని సవరించనున్నారు. వారి శిక్షను కూడా నిలుపుదలచేస్తారు. శిక్ష పడిన ఎంపీలు ఎమ్మెల్యేలు పార్లమెంటుకు లేదా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావచ్చు. అయితే వారికి ఓటు హక్కు ఉండదు. అంతేకాదు జీతం, ఇతర అలవెన్సులూ ఉండవు. వారి అప్పీలుపై కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకూ ఇది అమల్లో ఉంటుంది. ఈ మేరకు ముడి బిల్లును తయారు చేసినట్లు సమాచారం. దీని ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 లోని ఉప సెక్షన్ (4)కు మార్పులు చేయనున్నారు.

ఇక రెండో బిల్లు ప్రకారం... ఒక వ్యక్తి నిర్బం ధంలో ఉన్నంత మాత్రాన అతని ఓటు హక్కును నిరాకరించలేం. అతనికి తాత్కాలికంగా మాత్రమే ఓటుహక్కు ఉండదు. జైలులో ఉన్నా ఆ వ్యక్తి పేరు ఓటరు జాబితాలో కొనసాగుతుంది. అతను ఓటరుగానే ఉంటాడు. సదరు వ్యక్తి ఎన్నికయ్యేందుకు నామినేషన్ దాఖలు చేయొచ్చు. ఈమేరకు ప్రజాప్రాతినిధ్యచట్టం సెక్షన్ 62లోని ఉప సెక్షన్ (2)ని సవరించనున్నారు. ఈ రెండు సవరణలు 2013 జూలై 10 నుంచి అమల్లో ఉంటాయి. జైలులో ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులని, శిక్ష పడిన ప్రజా ప్రతినిధుల సభ్యత్వం పోతుందని జులై 10నే సుప్రీంకోర్టు తీర్పులిచ్చింది. ఈ రెండు తీర్పులను దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకించాయి.
 
కొలీజియం వ్యవస్థ రద్దుకు ఓకే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ గురువారం నిర్ణయించింది. దాని స్థానంలో జుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసే బిల్లుకు ఆమోదం తెలిపింది. న్యాయ వ్యవస్థ నుంచి వ్యతిరేకత వచ్చినా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ బిల్లు ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిలతోపాటు 24 హైకోర్టుల జడ్జిల నియామకాల విషయంలో ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కమిషన్‌కు తెలియజేస్తుంది. ఆయా రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల అభిప్రాయాలను కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. జడ్జీల నియామకాలకు పేర్లు సూచించాల్సిందిగా బార్ అసోసియేషన్లు, న్యాయ నిపుణులు, ఇతర సంఘాలను కూడా కమిషన్ కోరనుంది.

ప్రతిపాదిత బిల్లు కింద జడ్జిల నియామకాలు, బదిలీలకు ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) సారథ్యంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇందులో సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలు, న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. న్యాయశాఖ కార్యదర్శి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. రాజ్యాంగ సవరణ అవసరమయ్యే ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం కోసం న్యాయశాఖ గతకొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే ప్రభుత్వంలోని కొన్ని వర్గాలతోపాటు న్యాయ వ్యవస్థకు చెందిన వారు ఈ బిల్లులోని కొన్ని నిబంధనలను వ్యతిరేకించారు.

ప్రతిపక్ష నేతకు కూడా ఈ కమిషన్‌లో చోటు కల్పించాలని ప్రభుత్వం గతంలో భావించినా ప్రతిపాదిత కమిషన్‌లో మాత్రం స్థానం కల్పించలేదు. కానీ ఈ కమిషన్‌లో సభ్యులుగా ఇద్దరు ప్రముఖులను సిఫార్సు చేసే కమిటీలో మాత్రం ప్రతిపక్ష నేతకు చోటు కల్పించారు. ఈ కమిటీలో ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇతర సభ్యులుగా ఉంటారు. కాగా, ప్రభుత్వం వచ్చే వారం పార్లమెంటులో ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్ పదవికి కనీస అర్హతను నిర్దేశించే చట్ట సవరణ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement