convicted lawmakers
-
నేరాభియోగాలు ఉంటే పోటీకి అనర్హత!
న్యూఢిల్లీ: నేరస్థులను రాజకీయాలకు దూరంగా ఉంచే లక్ష్యంతో.. తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తూ చట్టం చేయాలని కేంద్ర న్యాయ మంత్రి కపిల్ సిబల్ కొత్త బిల్లును ప్రతిపాదించారు. దోషులుగా నిర్ధారితులైన ప్రజాప్రతినిధులకు తక్షణమే అనర్హత వర్తిస్తుందని, జైలు శిక్ష అనుభవించిన వారు ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును నిర్వీర్యం చేయటానికి కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాగా.. రాహుల్‌గాంధీ ఆ ఆర్డినెన్స్ ఓ చెత్తకాగితమని, చించిపారేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేయటం, ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను, బిల్లును ఉపసంహరించుకోవటం విదితమే. అయితే.. హత్య, అత్యాచారం, అపహరణ వంటి తీవ్రమైన నేరాభియోగాలు (ఏడేళ్లు, అంతకన్నా ఎక్కువ శిక్ష పడగల నేరాలు) ఎదుర్కొంటున్న వారిని సైతం ఎన్నికల్లో పోటీచేయటానికి అనర్హులను చేస్తూ కొత్త చట్టం చేయాలని సిబల్ తాజాగా ప్రతిపాదిస్తుండటం విశేషం. -
'నాన్సెన్స్' ఆర్డినెన్స్ ఉపసంహరణ
న్యూఢిల్లీ: దోషులైన ప్రజాప్రతినిధులను అనర్హులు చేయడాన్ని నిరోధిస్తూ తేవాలని తలపెట్టిన ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ వెనక్కి తీసుకుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును కూడా ఉపసంహరించుకుంది. ఆర్డినెన్స్ ఉపసంహరణ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించనుంది. రేపు రాజ్యసభ చైర్మన్‌కు బిల్లు ఉపసంహరణ లేఖ ఇవ్వనుంది. ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించడంతో కాంగ్రెస్ వెనక్కు తగ్గింది. అంతకుముందు ఢిల్లీలో పరిణామాలన్నీ వేగంగా మారాయి. వివాదస్పద ఆర్డినెన్స్‌పై ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలతో చర్చించారు. న్యాయపరమైన అంశాల గురించి అటార్నీ జనరల్ వాహనవతితో సమాలోచనలు జరిపారు. అమెరికా నుంచి వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్‌తో రాహుల్ ఈ ఉదయం భేటీ అయ్యారు. ఆర్డినెన్స్‌పై తన అభ్యంతరాలను ప్రధాని వివరించారు. తర్వాత జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కోర్ కమిటీ చర్చల సారాంశాన్ని వివరించారు. ఈ సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్, బిల్లు ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఆర్డినెన్స్‌ను నాన్సెన్స్గా రాహుల్ వర్ణించడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కేబినెట్ ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవడంతో రాహుల్ తన మాట నెగ్గించుకున్నట్టయింది. -
నేరస్తులకు కేంద్రం అభయ 'హస్తం'..!
నవ్విపోదురు గాక నాకేంటి.. అన్నట్టుగా ఉంది కేంద్ర ప్రభుత్వం తీరు. ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయకుండా నేరస్తులను రక్షించేందుకు సిద్ధపడుతోంది. భారత అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పులను ఆర్డినెన్స్‌ల రూపంలో కాలరాసేందుకు ప్రయత్నిస్తోంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణం అనర్హులవుతారని సుప్రీం కోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజాస్వామ్య వాదులందరూ హర్షం ప్రకటించారు. ఇక మీదట నేరస్తులు లేని చట్ట సభల్ని చూడొచ్చని సంబరపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు కార్యరూపం దాల్చకముందే తుంగలో తొక్కేందుకు అధికార యూపీఏ ప్రభుత్వం నడుంబిగించింది. సుప్రీం తీర్పు అమలు కాకుండా ఆర్డినెన్స్ తేవాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. కాగా ఆర్డినెన్స్ పార్లమెంట్లో ఇంకా ఆమోదం పొందాల్సివుంది. విశేషమేంటంటే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకటించిన తర్వాత దోషీగా తేలిన తొలి ఎంపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడం. ఓ వైపు వివాదాస్పద ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం చేస్తున్న పని తప్పని ఆయన బాహాటంగా అంగీకరించారు. శుక్రవారం న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్‌తో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ ఆశ్చర్యకరంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐతే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఏదేమైనా రాహుల్ వ్యాఖ్యలు యూపీఏ ప్రభుత్వానికి ఇబ్బందికరమే. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ఆమోదం పొందకపోవచ్చని భావిస్తున్నారు. -
సుప్రీం తీర్పులకు తిరస్కారం
* జైలులో ఉన్నా పోటీకి అర్హులే * కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం * శిక్ష పడ్డా ఎంపీలు, ఎమ్మెల్యేల సభ్యత్వం పోదు * ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు కీలకమైన తీర్పులను వ్యతిరేకించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చనీయాంశాలుగా ఉన్న అత్యంతకీలకమైన రెండు ప్రతిపాదనలకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జైలులో ఉన్నా ఎన్నికలలో పోటీచేసేందుకు అనుమతివ్వడం అందులో మొదటిది. అప్పీలు పెండింగ్‌లో ఉన్నంత వరకూ శిక్ష పడిన ఎంపీలు, ఎమ్మెల్యేల సభ్యత్వం యథాతథంగా ఉంచడం రెండోది. ఈ రెండు అంశాలపై ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తూ రెండు ప్రత్యేక బిల్లులు రూపొందించి వచ్చేవారం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షపడినా 90రోజుల్లోగా అప్పీలు చేసుకుంటే వారిపై అనర్హత వేటు వేయరాదని చట్టాన్ని సవరించనున్నారు. వారి శిక్షను కూడా నిలుపుదలచేస్తారు. శిక్ష పడిన ఎంపీలు ఎమ్మెల్యేలు పార్లమెంటుకు లేదా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావచ్చు. అయితే వారికి ఓటు హక్కు ఉండదు. అంతేకాదు జీతం, ఇతర అలవెన్సులూ ఉండవు. వారి అప్పీలుపై కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకూ ఇది అమల్లో ఉంటుంది. ఈ మేరకు ముడి బిల్లును తయారు చేసినట్లు సమాచారం. దీని ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 లోని ఉప సెక్షన్ (4)కు మార్పులు చేయనున్నారు. ఇక రెండో బిల్లు ప్రకారం... ఒక వ్యక్తి నిర్బం ధంలో ఉన్నంత మాత్రాన అతని ఓటు హక్కును నిరాకరించలేం. అతనికి తాత్కాలికంగా మాత్రమే ఓటుహక్కు ఉండదు. జైలులో ఉన్నా ఆ వ్యక్తి పేరు ఓటరు జాబితాలో కొనసాగుతుంది. అతను ఓటరుగానే ఉంటాడు. సదరు వ్యక్తి ఎన్నికయ్యేందుకు నామినేషన్ దాఖలు చేయొచ్చు. ఈమేరకు ప్రజాప్రాతినిధ్యచట్టం సెక్షన్ 62లోని ఉప సెక్షన్ (2)ని సవరించనున్నారు. ఈ రెండు సవరణలు 2013 జూలై 10 నుంచి అమల్లో ఉంటాయి. జైలులో ఉన్నవారు పోటీ చేయడానికి అనర్హులని, శిక్ష పడిన ప్రజా ప్రతినిధుల సభ్యత్వం పోతుందని జులై 10నే సుప్రీంకోర్టు తీర్పులిచ్చింది. ఈ రెండు తీర్పులను దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకించాయి. కొలీజియం వ్యవస్థ రద్దుకు ఓకే న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ గురువారం నిర్ణయించింది. దాని స్థానంలో జుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసే బిల్లుకు ఆమోదం తెలిపింది. న్యాయ వ్యవస్థ నుంచి వ్యతిరేకత వచ్చినా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిలతోపాటు 24 హైకోర్టుల జడ్జిల నియామకాల విషయంలో ప్రభుత్వం తన అభిప్రాయాన్ని కమిషన్‌కు తెలియజేస్తుంది. ఆయా రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల అభిప్రాయాలను కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది. జడ్జీల నియామకాలకు పేర్లు సూచించాల్సిందిగా బార్ అసోసియేషన్లు, న్యాయ నిపుణులు, ఇతర సంఘాలను కూడా కమిషన్ కోరనుంది. ప్రతిపాదిత బిల్లు కింద జడ్జిల నియామకాలు, బదిలీలకు ప్రభుత్వం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) సారథ్యంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇందులో సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలు, న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. న్యాయశాఖ కార్యదర్శి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. రాజ్యాంగ సవరణ అవసరమయ్యే ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం కోసం న్యాయశాఖ గతకొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే ప్రభుత్వంలోని కొన్ని వర్గాలతోపాటు న్యాయ వ్యవస్థకు చెందిన వారు ఈ బిల్లులోని కొన్ని నిబంధనలను వ్యతిరేకించారు. ప్రతిపక్ష నేతకు కూడా ఈ కమిషన్‌లో చోటు కల్పించాలని ప్రభుత్వం గతంలో భావించినా ప్రతిపాదిత కమిషన్‌లో మాత్రం స్థానం కల్పించలేదు. కానీ ఈ కమిషన్‌లో సభ్యులుగా ఇద్దరు ప్రముఖులను సిఫార్సు చేసే కమిటీలో మాత్రం ప్రతిపక్ష నేతకు చోటు కల్పించారు. ఈ కమిటీలో ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇతర సభ్యులుగా ఉంటారు. కాగా, ప్రభుత్వం వచ్చే వారం పార్లమెంటులో ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్ పదవికి కనీస అర్హతను నిర్దేశించే చట్ట సవరణ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.