న్యూఢిల్లీ: దోషులైన ప్రజాప్రతినిధులను అనర్హులు చేయడాన్ని నిరోధిస్తూ తేవాలని తలపెట్టిన ఆర్డినెన్స్ను కేంద్ర కేబినెట్ వెనక్కి తీసుకుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును కూడా ఉపసంహరించుకుంది. ఆర్డినెన్స్ ఉపసంహరణ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించనుంది. రేపు రాజ్యసభ చైర్మన్కు బిల్లు ఉపసంహరణ లేఖ ఇవ్వనుంది.
ఆర్డినెన్స్ను రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించడంతో కాంగ్రెస్ వెనక్కు తగ్గింది. అంతకుముందు ఢిల్లీలో పరిణామాలన్నీ వేగంగా మారాయి. వివాదస్పద ఆర్డినెన్స్పై ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలతో చర్చించారు. న్యాయపరమైన అంశాల గురించి అటార్నీ జనరల్ వాహనవతితో సమాలోచనలు జరిపారు.
అమెరికా నుంచి వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్తో రాహుల్ ఈ ఉదయం భేటీ అయ్యారు. ఆర్డినెన్స్పై తన అభ్యంతరాలను ప్రధాని వివరించారు. తర్వాత జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కోర్ కమిటీ చర్చల సారాంశాన్ని వివరించారు. ఈ సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్, బిల్లు ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఆర్డినెన్స్ను నాన్సెన్స్గా రాహుల్ వర్ణించడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కేబినెట్ ఆర్డినెన్స్ను వెనక్కు తీసుకోవడంతో రాహుల్ తన మాట నెగ్గించుకున్నట్టయింది.
'నాన్సెన్స్' ఆర్డినెన్స్ ఉపసంహరణ
Published Wed, Oct 2 2013 6:52 PM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement