రాహుల్ గాంధీ.. కాంగ్రెస్కు వరమా, భారమా?
పార్టీ - ప్రభుత్వం... అధికారంలో ఉన్నవాళ్లకు ఈ రెండూ రెండు కళ్లలా పనిచేయాలి. ఒకే బండికి కట్టిన రెండు గుర్రాల్లా సమానమైన వేగంతో పరుగులు తీయాలి. ఒకదాన్ని దాటి మరొకటి వెళ్లిపోతానంటే.. బండి పరుగు కాస్తా అస్తవ్యస్తం అయిపోతుంది. కేంద్రంలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పార్టీ ఉపాధ్యక్షుడి హోదాలో యువరాజు రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించడం, దాదాపుగా ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గాల్సి రావడం లాంటి పరిణామాలు ప్రభుత్వానికి మింగుడు పడట్లేదు. రాహుల్ గాంధీని ఒకానొక సమయంలో భావిప్రధానిగా అభివర్ణించిన మన్మోహన్ సింగ్ కూడా.. ఇప్పుడు ఆయనెందుకు ఇలా చేస్తున్నారో తెలియక సతమతం అవుతున్నారు.
వివాదాస్పద ఆర్డినెన్స్ తేవడానికి ముందు అదే అంశంపై జరిగిన రెండు కోర్ కమిటీ సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీ ఉన్నారు. ఆ సమావేశాలు జరిగినప్పుడే ఆయన దాని గురించి అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే.. అప్పుడే దాని గురించి ఓ నిర్ణయం తీసుకునేవారు. కానీ ఆయనలా చేయలేదు. ముందునుంచి ఏమీ మాట్లాడకుండా, దాదాపు అంతా అయిపోయిందునుకుంటున్న సమయంలో.. అదికూడా ప్రధానమంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ చెత్తదంటూ వ్యాఖ్యానించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పడేయడంలో ఒకరకంగా రాహుల్ సక్సెస్ అయితే అయి ఉండొచ్చు గాక. అలాగే, ఆర్డినెన్సును వెనక్కి తీసుకునేలా చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించి ఉండొచ్చు గాక. కానీ, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి- ప్రభుత్వానికి మధ్య అగాధం మరింత పెరిగిపోతోంది తప్ప ఏమాత్రం తగ్గట్లేదని భావిప్రధానిగా కాంగ్రెస్ శ్రేణులు మొత్తం భుజాన మోసుకెళ్తున్న యువరాజు ఎందుకు గమనించుకోవట్లేదో ఎవరికీ తెలియని విషయం. "ఈ ఆర్డినెన్స్ ఒక నాన్సెన్స్.. దాన్ని చించిపారెయ్యాలి. దాన్ని ఆమోదించడం ద్వారా ప్రభుత్వం తప్పు చేసింది'' అని రాహుల్ గాంధీ ఏకంగా విలేకరుల సమావేశంలోనే వ్యాఖ్యానించారు.
వాస్తవానికి కేంద్రం నేరచరితుల ఆర్డినెన్స్‌ను ఎందుకు జారీ చేసిందో అందరికీ తెలుసు. యూపీఏకు మద్దతిస్తున్న అనేక పార్టీలలోని పెద్దమనుషులు చాలామంది మీద లెక్కలేనన్ని కేసులున్నాయి. వరుసగా చూసుకుంటే ములాయం సింగ్ యాదవ్, మాయావతి, లాలూ ప్రసాద్.. ఇలా అందరూ 'పెద్ద మనుషులే'!! ఆర్డినెన్స్‌ను రాష్టపతి ఆమోదించి ఉంటే లాలూ ప్రసాద్ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడేవి కావు. కింద కోర్టుల్లో శిక్ష పడ్డా పై కోర్టుల్లో ఆ శిక్షను ధ్రువపరిచేవరకూ పదవిలో కొనసాగేందుకు వీలు కల్పించిన ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 (4) చెల్లదంటూ సుప్రీంకోర్టు గత జులైలో ప్రకటించడంతో కలవరపడ్డ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ రాహుల్ వ్యాఖ్యల పుణ్యమా అని ఈ ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.
సెప్టెంబర్ మొదటి వారంలో పార్లమెంటు ముందుకు బిల్లు వచ్చినప్పుడు గానీ, జైల్లో ఉన్న నేతలు అక్కడినుంచే పోటీ చేసేందుకు అనుమతించే బిల్లును పార్లమెంటు ఆమోదించినప్పుడు గానీ రాహుల్ గాంధీ చర్చల్లో పాల్గొనలేదు. ఆర్డినెన్సు జారీ అయినప్పుడు రాహుల్ ఏ కలుగులో దాగున్నారో తెలియదు గానీ, తర్వాత నాలుగు రోజులకు మాత్రం హడావుడిగా ప్రెస్ క్లబ్బులో ప్రత్యక్షమయ్యారు. విదేశాల్లో ఉన్న ప్రధాన మంత్రి పరువును నిండా గంగలో ముంచేసే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. ఇంత గొప్ప నాయకుడు ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ సంతోషించాలో, ఏడవాలో వాళ్లకే తెలియాలి మరి!!