కళంకిత ఆర్డినెన్స్‌పై యూపీఏ యూ టర్న్! | Cabinet unanimously decides to withdraw controversial Ordinance on lawmakers | Sakshi
Sakshi News home page

కళంకిత ఆర్డినెన్స్‌పై యూపీఏ యూ టర్న్!

Published Thu, Oct 3 2013 1:37 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

కళంకిత ఆర్డినెన్స్‌పై యూపీఏ యూ టర్న్! - Sakshi

కళంకిత ఆర్డినెన్స్‌పై యూపీఏ యూ టర్న్!

కళంకిత ఆర్డినెన్స్ అటకెక్కింది. రాహుల్ గాంధీ ఆశించినట్లే ఆ ఆర్డినెన్స్‌ను కేంద్రప్రభుత్వం ఉపసంహరించింది. దోషులైన ప్రజాప్రతినిధులను అనర్హులను చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఈ ఆర్డినెన్స్‌ను కేంద్రం రూపొందించిన సంగతి తెల్సిందే. ఆర్డినెన్స్‌పై రాహుల్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కేంద్రం యూ టర్న్ తీసుకుంది. దాంతోపాటు పార్లమెంటు ముందున్న ప్రజాప్రాతినిధ్య చట్టసవరణ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజంతా ప్రధాని వరుస సమావేశాలు... సమాలోచనల అనంతరం సాయంత్రం కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాహుల్ సూచించినట్లుగా కేంద్రం ఆ ఆర్డినెన్స్‌ను చించి పారేయకపోయినా దానిని ఉపసంహరించడం ద్వారా ప్రధాని అధికారాలను, ఆయన విశ్వసనీయతను చించిపారేసినట్లయింది. 
 
 కేబినెట్‌లోనూ, కోర్‌కమిటీలోనూ సుదీర్ఘ చర్చల తర్వాత రూపుదిద్దుకున్న ఈ ‘అనర్హత ఆర్డినెన్స్’పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరిగ్గా స్పందించడం వివాదాస్పదంగా మారింది. అదీ ప్రధాని అమెరికా పర్యటనలో ఒబామా సహా వివిధ దేశాధ్యక్షులతో సమావేశాలకు సమాయత్తమవుతుండగా రాహుల్ గాంధీ ‘అనర్హత ఆర్డినెన్స్‌పై నిప్పులు చెరగడం సంచలనంగా మారింది. ఆర్డినెన్స్‌పై రాహుల్ విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి కూడా. ఇపుడు ఆర్డినెన్స్ ఉపసంహరణతో వివాదం సమసిపోయినా ప్రధాని విశ్వసనీయతపై ఇది చెరగని మచ్చ వేసినట్లయిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని నివాసంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్‌ను, బిల్లును ఉపసంహరించుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయాన్ని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి మనీష్ తివారీ విలేకరులకు తెలిపారు. 
 
 ప్రధాని వరుస భేటీలు  
 వారం రోజుల సుదీర్ఘ పర్యటన అనంతరం అమెరికా నుంచి వచ్చిన ప్రధాని బుధవారం ముందుగా రాహుల్‌తో భేటీ అయ్యారు. రాహుల్ ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ‘‘ఆర్డినెన్స్‌పై కేవలం ప్రజల సెంటిమెంటును వ్యక్తం చేశానేగానీ, మిమ్మల్ని బాధపెట్టాలని కాదు’’ అంటూ రాహుల్ వివరించారు. ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ మతిలేని చర్యగా రాహుల్ గాంధీ గతవారం విమర్శించిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్‌ను చించిపారేయాలని, ఇలా రాజీ పడుతూ పోతే అన్నింటా రాజీ పడాల్సి వస్తుందంటూ తన తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. వీరి భేటీ తర్వాత కాంగ్రెస్ కోర్‌గ్రూప్ సమావేశం జరిగింది. ఇందులో ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర హోం మంత్రి షిండే, అహ్మద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభిమతాన్ని సోనియాగాంధీ ప్రధానికి తెలియపరిచారు. రాహుల్ ఎందుకు అలా వ్యాఖ్యానిం చాల్సి వచ్చిందన్నదానినీ వివరించారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ అయ్యి ప్రభుత్వ అభిప్రాయాలను తెలియజేశారు.
 
 మిత్రపక్షాలతో సంప్రదింపులు  
 ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్లు కేబినెట్ భేటీకి ముందే ప్రధాని మిత్రపక్షాలకు తెలియజేశారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, ఆర్‌ఎల్డీ అధినేత అజిత్‌సింగ్‌తో ప్రధాని మాట్లాడారు. అటార్నీ జనరల్ వాహనవతి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. దీనిపై మీడియా అజిత్‌సింగ్‌ను ప్రశ్నించగా ప్రభుత్వ నిర్ణయం పట్ల సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. 
 
 
 కేబినెట్ సమావేశంతో ముగింపు టచ్
 ముందుగానే స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం, బుధవారం సాయంత్రం ప్రధాని నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశంతో ఆర్డినెన్స్‌కు మంగళం పాడింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం 20 నిమిషాలలో ముగిసింది. ఆర్డినెన్స్‌తోపాటు, బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని తీర్మానించింది. ప్రజాభిప్రాయానికి తగినట్లు తీసుకున్న నిర్ణయంగా దీనిని మనీష్ చెప్పారు. సమావేశంలో కేంద్ర మంత్రి కపిల్ సిబల్ రాహుల్ డిమాండ్‌నే మరోసారి వినిపించారు. 
 
 ఆర్డినెన్స్‌పై జరిగిన వరుస పరిణామాలను ఎన్‌సీపీ అధినేత కేంద్ర మంత్రి శరద్‌పవార్ ఈ సందర్భంగా తప్పుబట్టారు. మిత్రపక్షాలను సంప్రదించకుండా ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా రాహుల్ ఇలా మాట్లాడాల్సి ఉండరాదని, ప్రధాని తిరిగి వచ్చే వరకూ వెచి ఉంటే బావుండేదన్న ఎన్‌సీ నేత, కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా మాత్రం సమావేశంలో మాట్లాడలేదని సమాచారం. ఇక స్టాండింగ్ కమిటీ ముం దున్న బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లకు తెలియజేయనుంది. 
 
 ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఎస్పీ
 ప్రభుత్వ నిర్ణయాన్ని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యతిరేకించింది. ప్రధాని ఆర్డినెన్స్‌కు మద్దతుగానే నిలవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వెలుపలి నుంచి ఇస్తున్న తమ పార్టీ మద్దతు కొనసాగుతుందని లాలూ ప్రసాద్ సారధ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ప్రకటించింది. తమ పార్టీ అధినేత లాలూను రక్షించేందుకే కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందనే ప్రచారంపై ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘువంశ ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవడం తప్ప మరో మార్గం లేదని వామపక్షాలు కేబినెట్ భేటీకి ముందే పేర్కొన్నాయి. మన్మోహన్ సింగ్ షాడో ప్రధానిగా సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్ వ్యవహారం యూపీఏ, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంగా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తన పార్టీ స్వప్రయోజనాల కోసం ఆర్డినెన్స్‌పై ప్రకటన చేసినా, ప్రజలకు మేలు చేశారని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎన్ సంతోష్ హెగ్డే వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి తెలిసివచ్చిందన్నారు. తాము మొదటి రోజు నుంచీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. 
 
 మాది, దేశ ప్రజల విజయం: బీజేపీ 
 తాము తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ పేర్కొంది. ఇది దేశ ప్రజల అభిమతంగా, వారి విజయంగానూ అభివర్ణించింది. ఇది సుప్రీంకోర్టు అభిప్రాయమని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి తెలిపారు. ప్రజలు, ప్రతిపక్షాల నిరసనల వల్ల ఇది సాధ్యమైందన్నారు. అఖిలపక్ష సమావేశంలో బీజేపీ కూడా అంగీకరించిందని, దాంతోనే ఆర్డినెన్స్‌ను రూపొందించామంటూ కేంద్ర మంత్రి కమల్‌నాథ్ వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. 
 
 మరోవైపు రాహుల్ గాంధీ వైఖరిపై బీజేపీ పలు సందేహాలను లేవదీసింది. రాహుల్ వ్యతిరేకత వల్లే కేంద్రం ఆర్డినెన్స్‌పై వెనక్కి తగ్గిందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. యూపీఏ ప్రభుత్వంలో ఒకదాని తర్వాత ఒక స్కాములు వరుసగా బయటకు వస్తుంటే రాహుల్ ఒక్క మాటా మాట్లాడకుండా ఉండి, ఇప్పుడు ఆర్డినెన్స్‌పై నోరువిప్పడం తీవ్రమైన అనుమానాలను కలిగిస్తోందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.  
 
 సుప్రీం తీర్పు నుంచి ఉపసంహరణ వరకు వయా రాహుల్
  దోషులుగా తేలి, క్రిమినల్ కేసుల్లో రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని జూలై 10న సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. 
  కేంద్ర అఖిల పక్ష భేటీ అనంతరం అనర్హత వేటు నుంచి ప్రజాప్రతినిధులను కాపాడేందుకు వీలుగా ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేస్తూ ఒక బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 
  {పతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు నివేదించడానికి ప్రభుత్వం అంగీకరించింది. 
  సుప్రీం తీర్పు నేపథ్యంలో నేరచరితులైన ప్రజాప్రతినిధులపై వెంటనే వేటు పడకుండా ఉండడానికి సెప్టెంబర్ 24న కేబినెట్ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. 
  తర్వాత రోజు నుంచి విపక్షాలు ఆందోళన మొదలు పెట్టాయి. ఆర్డినెన్స్ అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని విమర్శించిన బీజేపీ నేతలు సెప్టెంబర్ 26న రాష్ట్రపతిని కలసి ఆర్డినెన్స్ వెనక్కి పంపాల్సిందిగా వినతి పత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన రాష్ట్రపతి ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా హోం మంత్రి షిండేను, న్యాయమంత్రి కపిల్ సిబల్‌ను ఆదేశించారు. 
  సెప్టెంబర్ 27న ప్రధాని మన్మోహన్ అమెరికా అధ్యక్షుడు ఒబామాను కలిసేందుకు సమాయత్తమవుతుండగా.. ఇక్కడ రాహుల్ గాంధీ ఆర్డినెన్స్‌పై నిప్పులు చెరిగారు. దాన్నో నాన్సెన్స్‌గా అభివర్ణించడమే కాకుండా, చింపి చెత్తబుట్టలో పడేయాలన్నారు. 
  పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చర్చించిన మీదటే ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకున్నామని అక్టోబర్ 1న మన్మోహన్ వెల్లడించారు. ఆర్డినెన్స్‌పై మరోసారి కేబినెట్‌లో చర్చిస్తామని, ఆ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్తామని ప్రకటించారు. 
  కోర్‌కమిటీ సమావేశానికి ముందు రాహుల్‌ను ఆయన నివాసంలో ప్రధాని కలుసుకున్నారు. అనంతరం కోర్ కమిటీ కూడా ఆర్డినెన్స్ ఉపసంహరణకు మద్దతిచ్చింది. తర్వాత రాష్ట్రపతిని ప్రధాని కలిశారు. చివరిగా కేబినెట్ భేటీలో ఇందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు.  
 
 72 మంది ఎంపీలపై ‘అనర్హత’ కత్తి!
 న్యూఢిల్లీ: వివిధ క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్న 72 మంది ఎంపీలు దోషులుగా తేలి, వారికి రెండేళ్లకు మించి శిక్షలు పడినట్లయితే, వారిపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. వీరిలో బీజేపీ ఎంపీలు 18 మంది, కాంగ్రెస్ ఎంపీలు 14 మంది, సమాజ్‌వాదీ పార్టీ (8), బీఎస్పీ (6), ఏఐఏడీఎంకే (4), జేడీయూ (3), సీపీఎం (2) ఉన్నారు. మిగిలిన 17 మంది ఇతర పార్టీలకు చెందిన వారు. ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో కాంగ్రెస్ ఎంపీ రషీద్ మసూద్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చగా, దాణా కుంభకోణం కేసులో రాంచీలోని సీబీఐ కోర్టు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సహా పలువురిని దోషులుగా తేల్చిన దరిమిలా ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2009 లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 4,807 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 1,460 మంది (30 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 
 
 రాహుల్ ముద్ర పడాల్సిందేనా?
  తాజా పరిణామాల తర్వాత ఢిల్లీ రాజకీయ వర్గాల్లో పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి..
  ప్రధాని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నారు. కానీ, ఇక రాహుల్ సమ్మతి లేకుండా ఏదైనా నిర్ణయం తీసుకోగలరా? లేదా చట్టాన్ని తీసుకురాగలరా? 
  భవిష్యత్తులోనూ రాహుల్ ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోరని ప్రధాని భావిస్తున్నారా? 
  విదేశీ ప్రతినిధులతో చర్చల సందర్భంగా, ఒప్పందాల సమయంలో ‘ఇందుకు రాహుల్ సర్ అనుమతి ఉందా’ అన్న ప్రశ్న ఎదురైతే ప్రధాని వారిని ఒప్పించగలరా? 
  {పభుత్వ నిర్ణయాన్ని.. ప్రజాస్వామ్యంపై కుట్రగా సమాజ్‌వాదీ పార్టీ అభివర్ణించింది. తాజా పరిణామం ప్రభుత్వం కంటే వ్యక్తులే బలవంతులన్న సంకేతాన్ని ఇస్తోందని పేర్కొంది. 
  యూపీఏ పాలనలో ఒకవైపు ప్రభుత్వ సంస్థలు, శాఖల విధ్వంసం, మరోవైపు వరుస స్కాములు, ఇప్పుడు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రతిష్టకు పణంగా పెట్టడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement