కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఉదయం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో భేటీ అయ్యారు. నేరచరిత ప్రజాప్రతినిధులకు సంబంధించి కేంద్రం ఆమోదించిన ఆర్డినెన్స్‌పై తీవ్ర రగడ చెలరేగుతున్న వేళ ప్రధానితో రాహుల్ సమావేశం అయ్యారు. సెవెన్ రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసానికి వెళ్లిన రాహుల్... ఆర్డినెన్స్‌ను చించి పారేయాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తన వ్యాఖ్యలపై మన్మోహన్ నొచ్చుకున్నారనే వార్తల నేపథ్యంలో రాహుల్... ప్రధానికి వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
అటు... కాంగ్రెస్ కోర్ కమిటీ కూడా ఇవాళ సమావేశం కానుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో కోర్ కమిటీ సమావేశమై ఆర్డినెన్స్ సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనుంది. మరోవైపు... ఈ సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఆర్డినెన్స్ అంశంపైనే ఈ భేటీలో చర్చ జరగనుందని సమాచారం. తెలంగాణ నోట్‌పై సమావేశంలో కూడా చర్చ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.
నేర చరితులైన చట్టసభ సభ్యులను రక్షించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌పై రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగిన నేపథ్యంలో తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో మంగళవారం విమానంలోనే విలేఖరులతో మాట్లాడిన ఆయన ‘నేనంత తేలికగా మనస్థాపానికి గురికాను. రాజీనామా చేయను’ అని వ్యాఖ్యానించారు. బుధవారం రాహుల్‌గాంధీతో సమావేశమై ఏ కారణాల వల్ల ఆయన ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించారన్న విషయాన్ని నిర్థారించుకుంటానని మన్మోహన్ తెలిపారు.