నేరస్తులకు కేంద్రం అభయ 'హస్తం'..!
నవ్విపోదురు గాక నాకేంటి.. అన్నట్టుగా ఉంది కేంద్ర ప్రభుత్వం తీరు. ఎన్ని విమర్శలు వచ్చినా ఖాతరు చేయకుండా నేరస్తులను రక్షించేందుకు సిద్ధపడుతోంది. భారత అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పులను ఆర్డినెన్స్ల రూపంలో కాలరాసేందుకు ప్రయత్నిస్తోంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణం అనర్హులవుతారని సుప్రీం కోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజాస్వామ్య వాదులందరూ హర్షం ప్రకటించారు. ఇక మీదట నేరస్తులు లేని చట్ట సభల్ని చూడొచ్చని సంబరపడ్డారు.
సుప్రీం కోర్టు తీర్పు కార్యరూపం దాల్చకముందే తుంగలో తొక్కేందుకు అధికార యూపీఏ ప్రభుత్వం నడుంబిగించింది. సుప్రీం తీర్పు అమలు కాకుండా ఆర్డినెన్స్ తేవాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. కాగా ఆర్డినెన్స్ పార్లమెంట్లో ఇంకా ఆమోదం పొందాల్సివుంది. విశేషమేంటంటే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకటించిన తర్వాత దోషీగా తేలిన తొలి ఎంపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడం.
ఓ వైపు వివాదాస్పద ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం చేస్తున్న పని తప్పని ఆయన బాహాటంగా అంగీకరించారు. శుక్రవారం న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్తో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ ఆశ్చర్యకరంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐతే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఏదేమైనా రాహుల్ వ్యాఖ్యలు యూపీఏ ప్రభుత్వానికి ఇబ్బందికరమే. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ ఆమోదం పొందకపోవచ్చని భావిస్తున్నారు.